కొత్త డిజిటల్‌ ఇండియా చట్టంలో తగిన రక్షణలు

29 May, 2023 04:42 IST|Sakshi

ఏఐ వంటి వాటికి ప్రత్యేక చాప్టర్‌

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్‌ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్‌ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. భారత్‌ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్‌ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు.

డిజిటల్‌ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్‌ చంద్రశేఖర్‌ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్‌ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్‌ జీపీటీని సృష్టించిన ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం.

శామ్‌ ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్‌ మ్యాన్‌ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్‌ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు.   

డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట
ప్రతిపాదిత డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్‌–చెక్‌ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు.

వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్‌షిప్‌ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు