కొత్త ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు.

15 Jun, 2021 00:57 IST|Sakshi

సాంకేతిక లోపాలతో ఇప్పటికీ పనిచేయని కొన్ని ఫీచర్లు

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్‌ పోర్టల్‌కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్‌ కావడానికి సుదీర్ఘ కాలం పట్టేస్తుండటంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్‌ను ప్రారంభించినప్పట్నుంచీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్‌ అకౌంటెంట్లు తెలిపారు.

పన్ను చెల్లింపుదారులు తాము గతంలో ఈ–ఫైలింగ్‌ చేసిన రిటర్నులను చూసుకోవడానికి కుదరడం లేదని, ఇంకా చాలామటుకు ఫీచర్లకు ’కమింగ్‌ సూన్‌ (త్వరలో అందుబాటులోకి వస్తాయి)’ అంటూ పోర్టల్‌ చూపిస్తోందని వారు పేర్కొన్నారు.

లాగిన్‌ మొదలుకుని ఈ–ప్రొసీడింగ్స్‌ వంటి కీలకమైన ఫీచర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనాల్సి వస్తోందని నాంగియా అండ్‌ కో పార్ట్‌నర్‌ శైలేష్‌ కుమార్‌ చెప్పారు. దీంతో నిబంధనల ఉల్లంఘన నోటీసులు అందుకుంటున్న వారు వివరణ ఇచ్చేందుకు తగినంత వ్యవధి దొరక్క ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ‘పన్ను చెల్లింపుదారులు తమ నియంత్రణలో లేని అంశాల కారణంగా పెనాల్టీ పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫారం 15సీఏ/సీబీ లేకపోవడం వల్ల విదేశాలకు నిధులు పంపించే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు‘ అని కుమార్‌ తెలిపారు.  

మరోవైపు, ఇటు ట్యాక్స్‌పేయర్లు అటు ట్యాక్స్‌ నిపుణులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో కొత్త పోర్టల్‌ను సత్వరం సరిచేయాల్సిన అవసరం ఉందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ పేర్కొన్నారు. కొత్త పోర్టల్‌పై అంతా భారీ అంచనాలు పెట్టుకోగా.. చాలా మందకొడిగా పనిచేస్తోందని, యూజ ర్లు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఆర్తి తెలిపారు.

మ్యాన్యువల్‌గా రెమిటెన్స్‌ ఫారంల ఫైలింగ్‌..
పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మ్యాన్యువల్‌గా ఫైలింగ్‌ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. విదేశీ రెమిటెన్సులకు అవసరమైన ఫారం 15సీఏ/సీబీని జూన్‌ 30 దాకా బ్యాంకులకు మాన్యువల్‌గా సమర్పించవచ్చని తెలిపింది. వీటిని తర్వాత ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారని ఐటీ విభాగం వివరించింది.

మరిన్ని వార్తలు