బస్సు డ్రైవర్లు జాగ్రత్త ! పరధ్యానంగా ఉంటే..

4 Jun, 2022 15:26 IST|Sakshi

రోడ్డు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. లిప్తకాలం పాటు చేసే పొరపాటు నిండు ప్రాణాలకే చేటు తెస్తుంది. తాజాగా కర్నాటకలోని కలబుర్గిలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహారణ. ఈ తరహా ప్రమాదాలు నివారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని నిర్ణయించింది.

శివాయ్‌-ఈ 
టెక్నాలజీ ఉపయోగిస్తూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడంతో పాటు ప్రమాణంలో భద్రత పెంచే ప్రయత్నంలో ఉంది మహారాష్ట్ర సర్కారు. అందులో భాగంగా ఇటీవల ఎలక్ట్రిక్‌ బస్సులను మహా సర్కార్‌ కొనుగోలు చేసింది . వీటిని శివాయ్‌-ఇ పేరుతో జూన్‌ 1 నుంచి పూనే నుంచి అహ్మద్‌నగర్‌ల మధ్య నడిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు దేశంలోని మిగిలిన బస్‌ సర్వీసుల కంటే మిన్నగా శివాయ్‌-ఇ బస్సుల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌
శివాయ్‌-ఇ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌ బస్సులుగా రూపొందించారు. బస్సు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండేందుకు.. ఇందులో డ్రైవర్‌ క్యాబిన్‌ సెంట్రిక్‌గా సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ టీవీ కెమెరా మానిటరింగ్‌ వ్యవస్థకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను జోడించారు. అంతేకాదు సీసీకెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా లైవ్‌ మానిటరింగ్‌ చేస్తుంటారు.

అలెర్ట్‌.. అలెర్ట్‌..
ప్రయాణ సమయంలో డ్రైవర్లకు నిద్రమత్తు ఆవహించినా, డ్రైవింగ్‌ చేస్తూ ఎవరితోనైనా మాట్లాడుతున్నా... మొబైల్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నా సీసీ కెమెరాలో వెంటనే పసిగడతాయి. ఈ సీసీ కెమెరాలకు అనుసంధానించబడిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వ్యవస్త వెంటనే తన పని ప్రారంభిస్తుంది. జాగ్రత్తగా నడపాలంటూ వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దీంతో పాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కి కూడా కీలక సూచనలు చేరవేస్తుంది. అంతేకాదు మితిమీరిన వేగంతో బస్సు వెళ్తున్నా వెంటనే అలెర్ట్‌ చేస్తుంది. 

మూడువేల బస్సుల్లో
మహారాష్ట్ర ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం మూడువేల ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంది. వీటన్నింటిలోనూ ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. వీటితో పాటు పాత బస్సుల్లోనూ  డ్రైవర్‌ మానిటరింగ్‌ అలెర్ట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మహా రవాణా శాఖ అధికారులు తెలిపారు. 
చదవండి: ఎక్కడికెళ్లినా ఈ పాడు బుద్ది పోదా.. మెటావర్స్‌లో లైంగిక వేధింపులు

మరిన్ని వార్తలు