New Office Rule Viral Pic: ఆఫీస్‌లో కొత్త రూల్‌.. ఒక నిమిషం లేట్‌గా వస్తే పది నిమిషాల అదనపు పని!

13 Jun, 2022 11:13 IST|Sakshi

ఆఫీసు పని వేళలు, ఉద్యోగుల క్రమ శిక్షణ, అంకిత భావం, మేనేజ్‌మెంట్‌ ప్రవర్తన తదితర అంశాలపై ఓ నెటిజన్‌ అడిగిన ధర్మసందేహం ట్విటర్‌లో కాక రేపుతోంది. నిమిషానికి వందల సంఖ్యలో నెటిజన్లు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా కొందరు యాజమాన్యాలకు వత్తాసు పలికారు. అతి కొద్ది మంది సీరియస్‌ మ్యాటర్‌లోనూ కొంటెగా కామెంటారు. 

గబ్బర్‌ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ నెటిజన్ల ముందు నోటీస్‌ బోర్డులో కనిపించిన దృశ్యాన్ని ఉంచాడు. అందులో... ‘ ఈ రోజు నుంచి మీరు ఆఫీస్‌కి ఒక నిమిషం ఆలస్యం అయితే పది నిమిషాలు అదనంగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఉదయం పది గంటలకు రావాల్సిన వాళ్లు 10 గంటల 2 నిమిషాలకు వస్తే సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వారు అదనంగా 20 నిమిషాలు పని చేసి 6:20 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది’  అంటూ మీ ఆఫీసు నోటీస్‌ బోర్డులో ఇలాంటి ఒక ఆర్డర్‌ ఉంటే మీ స్పందన ఏంటీ అంటూ అడిగాడు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఉద్యోగులకు మద్దతుగా
- కొద్ది మంది యజమానులు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. లాభాల కోసం ఎలాంటి పనులకైనా తెగిస్తారు. కానీ వారు అలా చేసే పనుల వల్ల వారి వ్యాపారాలు సంస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు.
- మరోకరు తన ఆఫీసు అనుభవాన్ని పంచుకుంటూ.... మా ఆఫీసులో పిగ్గీబ్యాంకు అని పెట్టారు. ఆఫీసుకు లేట్‌గా వచ్చిన వాళ్లు జరిమానా కట్టాలి. ఒక నిమిషం లేట్‌గా వచ్చిన వాళ్లు రూ.100ను పిగ్గీ బ్యాంకులో జమ చేయాలి. ఉద్యోగులపై సంస్థకు నమ్మకం లేదు అనడానికి ఇవన్నీ ఉదాహారణలు అని చెప్పుకొచ్చారు.
- ఇవన్ని పనికి మాలిన పనులు ఆఫీసులు ఎన్ని గంటలు ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఉన్న సమయంలో ఎంత వరకు పనికి వచ్చాం. మన వల్ల ఎంత ఉత్పత్తి జరిగిందనేది ముఖ్యం అంటూ మరో నెటిజన్‌ మండిపడ్డాడు.

యాజమన్యానికి అనుకూలంగా
- స్కూల్‌కి 8 గంటలకల్లా వెళ్లాలి అంటే కచ్చితంగా అదే సమయానికి అక్కడ ఉంటాం. కదా మరీ ఆఫీసులకు రావడానికి ఇబ్బంది ఏంటీ? ఎందుకు సమయానికి ఆఫీసుకు రమ్మంటే సాకులు వెతుక్కుంటారంటూ యజమాన్యానికి మద్దతుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
- ఆలస్యంగా వస్తే ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధన సరైనదే. కంపెనీలన్నీ హెచ్ఆర్‌ పాలసీ మీద నడుస్తుంటాయి. ఉద్యోగులు ఆలస్యంగా వస్తే దాని ప్రభావం ఉత్పత్తిపై, లాభాలపై కనిపిస్తుంది. కాబట్టి పనిలో జీవితంలో క్రమశిక్షణ అన్నది సరైనదే.

కొంటె సమాధానాలు
ఆలస్యంగా వస్తే అదనంగా పని చేయాలనే నిబంధనపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. మరీ ఆఫీస్‌కి ముందు వస్తే ముందుగానే బయటకు వెళ్లిపోవచ్చా అంటూ కొంటెగా ప్రశ్నించాడు. నిర్దేశిత సమయం కంటే ఆరు నిమిషాల ముందు వస్తే.. ఒక గంట ముందుగానే ఆఫీస్‌ వదిలిపోతామంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే ఇంతకీ ఏ ఆఫీసులో ఈ తరహా నిబంధన అమలు చేయాలనుకుంటున్నారనే అంశం వీరి సంవాదంలో ఎక్కడా కనిపించలేదు.

చదవండి: ఓ సీఈవో వేడుకోలు: ఆఫీస్‌కు రండయ్యా!

మరిన్ని వార్తలు