సరికొత్త ఆన్‌లైన్ మోసం.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు!

17 Jan, 2022 21:44 IST|Sakshi

ఆన్‌లైన్‌లో అప‌రిచిత వ్య‌క్తుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు, సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు, మీడియా ఎంత చెబుతున్నా కొంద‌రు అస్సలు పట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో దేశంలో చాలా మంది డ‌బ్బు న‌ష్ట‌పోతున్నారు. ఫోన్‌లో బ్యాంకు వివరాలు అడిగే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వరాదని ముఖ్యంగా ఎటిఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అసలే తెలుపవద్దని వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎంత ప్రచారం చేస్తున్న అమాయకులు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆన్‌లైన్ మోసాలకు గురవుతునే ఉన్నారు.

తాజాగా మరోసారి హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతున్న కొత్త ఆన్‌లైన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు ప్రజలను మోసగించడానికి, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు. ఈ కొత్త డిజిటల్ మోసాన్ని మొదట జర్నలిస్ట్ విశాల్ కుమార్ నివేదించారు. తన స్వంత అనుభవాలను పంచుకున్న కుమార్ హ్యాకర్లు తనను ఏ విధంగా మోసం చేయలని చూశారో పేర్కొన్నారు. 

ఈ ఆన్‌లైన్‌ స్కామ్ ప్రకారం.. మొదట హ్యాకర్లు మీ సిమ్ కార్డ్ డాక్యుమెంటేషన్ అసంపూర్ణంగా ఉందని, వెంటనే వివరాలను పంచుకోవాలని లేకపోతే 24 గంటల్లోగా సేవలు డీయాక్టివేట్ చేయనున్నట్లు ఒక సందేశాన్ని ప్రజలకు పంపుతారు. వాస్తవానికి, అది హ్యాకర్లు పంపిన నకిలీ సందేశం మాత్రమే. ఈ నకిలీ యాప్స్ డౌన్‌లోడ్ చేయలని ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో మీ వివరాలను సేకరిస్తాయి. అందులో ఇచ్చిన ఒక నెంబర్ కి చేయాలి మెసేజ్ సూచిస్తుంది. కుమార్ ఆ కస్టమర్ కేర్ నెంబరుకు డయల్ చేశాడు. అప్పుడు ఆ నకిలీ కస్టమర్ Any Remote DeskTop అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని హ్యాకర్ సూచించినట్లు చెప్పాడు. 

అయితే, ఈ యాప్ ద్వారా అవతలి వ్యక్తి మీ స్క్రీన్ నమోదు చేసే వివరాలు మొత్తం చూసే అవకాశం ఉంది. మీరు గనుక డబ్బులు చెల్లించడానికి ఆ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగిస్తే ఆ వివరాలు హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది. అందుకని, కస్టమర్, ఈ-కెవైసీ పేరుతో ఎవరైనా కాల్ చేసిన, మెసేజ్ పంపిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

(చదవండి: టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్..!)

మరిన్ని వార్తలు