కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు అప్‌

16 Jul, 2022 01:31 IST|Sakshi

ఏప్రిల్‌–జూన్‌లో 24 శాతం ప్లస్‌

రూ. 3.64 లక్షల కోట్లకు చేరిక

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు దాదాపు 24 శాతం ఎగశాయి. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో రూ. 3.64 లక్షల కోట్లను తాకాయి. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే పెట్టుబడులు పుంజుకున్నప్పటికీ జనవరి–మార్చి(క్యూ4)తో పోలిస్తే 38 శాతంపైగా క్షీణించినట్లు బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ రూపొందించిన నివేదిక తెలియజేసింది. అయితే గత క్యూ4లో ప్రాజెక్టు ఇన్వెస్ట్‌మెంట్స్‌ వార్షిక ప్రాతిపదికన  130 శాతం జంప్‌ చేసినట్లు నివేదిక పేర్కొంది. రూ. 5.91 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం..

కరోనా ఎఫెక్ట్‌
కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్ట్‌ పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. తదుపరి గతేడాది క్యూ4 నుంచి మాత్రమే పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. అయితే రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం కొన‘సాగు’తుండటంతో తలెత్తిన అనిశ్చితులు, వీటితో ఆంక్షల విధింపు వంటి అంశాలు ఇన్వెస్ట్‌మెంట్‌ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా కొనసాగుతున్న చిప్‌ల కొరత, వడ్డీ రేట్ల పెరుగుదల సైతం వీటికి జత కలుస్తున్నాయి. ఈ ప్రభావం క్యూ1లో కొత్త ప్రాజెక్టులపై పడింది.

వెరసి వీటి సంఖ్య సగానికి పడిపోయింది. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 545 నుంచి 247కు వెనకడుగు వేశాయి. ఇదేవిధంగా ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు సైతం 59 శాతం క్షీణించి రూ. 32,700 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ప్రయివేట్‌ రంగంలో మాత్రం కొత్త ప్రాజెక్టుల సంఖ్య 188కు ఎగశాయి. వీటి ప్రతిపాదిత పెట్టుబడులు రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. క్యూ4లో ప్రయివేట్‌ రంగ పెట్టుబడి వ్యయాలు రూ. 3.9 లక్షల కోట్లుకాగా.. ప్రభుత్వం నుంచి రూ. 2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ఆర్థిక పరిస్థితులతో
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం గరిష్ట స్థాయిలో పెట్టుబడి వ్యయాలు ప్రతిపాదించినప్పటికీ నీరసించిన ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్యవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. వడ్డీ రహితం(సున్నా రేటు)లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల రుణాలను అందించడంలో తాత్సారం చేస్తోంది. మరోపక్క రాష్ట్రాలు సైతం కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులలో రాష్ట్రాల వాటా 8 శాతమే కావడం గమనార్హం! ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాలను ప్రతిపాదించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇవి  24.5 శాతం అధికం!! 

మరిన్ని వార్తలు