2022 ఆరంభం నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే!

14 Jul, 2022 17:43 IST|Sakshi

2022 ఆరంభంలో  డాలరు మారకంలో 74 వద్ద రూపాయి

ఫిబ్రవరి నుంచి 27 సార్లు ఆల్‌ టైం కనిష్టానికి

ఈ నెలలో ఇప్పటివరకు  ఐదుసార్లు

సమీప కాలంలో 82 కి పడిపోవచ్చు:  మార్కెట్‌ వర్గాలు

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్‌లో ఆల్‌ టైం కనిష్టాన్ని టచ్‌ చేసింది.  79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి  రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది.  అంతేకాదు సమీప కాలంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 కి పడిపోవచ్చని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్‌ ఆంక్షలు దేశీయ కరెన్సీని అతలాకుతలం చేశాయి. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌-రష్యా వార్‌ తరువాత రూపాయి ఏకంగా 27 సార్లు అత్యంత కనిష్టానికి  పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి ఐదుసార్లు కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. 2022 ప్రారంభంలో  డాలరకు 74 వద్ద ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి 6.4 శాతం నష్టపోయి 80 స్థాయికి చేరేందుకు అతి సమీపంలో ఉంది. మరోవైపు ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్‌ను కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 20 సంవత్సరాల గరిష్ట స్థాయి 107.74కి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ డేటా తెలుపుతోంది.  

ఇకవైపు ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, భారత కరెన్సీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ పాలసీ మరింత కఠినంకానుందన్న అంచనాలు మధ్య డాలరుపై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది.  

ప్రపంచమాంద్య భయాలు, యూరప్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు లాంటివి రూపాయిని దెబ్బ తీస్తున్నాయి. రూపాయి పతనం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ పతనాన్ని అడ్డుకోలే పోతున్నాయి.  రూపాయిని రక్షించేందుకు బంగారం దిగుమతులపై పన్ను, స్పాట్ అండ్‌ ఫ్యూచర్స్ ఫారెక్స్ మార్కెట్‌లలో జోక్యం, ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను నేరుగా పెంచడానికి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం రుపీ సెటిల్‌మెంట్ విధానాన్నిఇటీవల ఆర్బీఐ  ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు