సముద్ర గర్భంలో సవాల్‌! ఇంటర్నెట్‌ కేబుళ్లపై పెత్తనానికి అమెరికా, చైనా ఢీ

10 Jun, 2023 20:08 IST|Sakshi

అమెరికా, చైనా ఆధిపత్య పోరు ఇప్పుడు సముద్ర గర్భంలోకి చేరింది. సమాచార విప్లవ వారధులైన సముద్రంలోని ఇంటర్నెట్‌ కేబుళ్లపై పెత్తనానికి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 

ఫోన్లు, వీడియో చాట్లు, ఈ మెయిల్స్.. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు మూలం ఇంటర్నెట్. సముద్రాల్లో ఏర్పాటుచేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95 శాతం డాటా అనుక్షణం ట్రాన్స్‌ఫర్ అవుతోంది. ఇప్పుడా కేబుల్ వ్యవస్థలే అమెరికా, చైనా మధ్య సముద్రంలో మంటలు రేకెత్తించాయి. రెండు అగ్రరాజ్యాల  మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికీ ఆయుధాలవుతున్నాయి. చాలాకాలంగా ఈ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అమెరికా కంపెనీల చేతుల్లో సాగుతోంది. తాజాగా... చైనాకు చెందిన కన్సార్షియం రంగంలోకి దిగటంతో సమస్య మొదలైంది.

ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకూ సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్‌ వేయడానికి అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్షియానికి పోటీగా ముందుకొచ్చింది చైనా కంపెనీ హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్‌వర్క్‌. హెచ్ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతో పాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది.

అయితే.. సబ్‌సీ ఇంటర్నెట్‌ కేబుల్‌ వ్యవస్థ చైనా చేతుల్లోకి వెళ్లకుండా బలంగానే పావులు కదిపింది అమెరికా. బైడెన్‌ ప్రభుత్వం పరోక్షంగా రంగంలోకి దిగి కన్సార్షియంలోని కంపెనీలను దారిలోకి తేవడం మొదలుపెట్టింది. సర్కారు ఒత్తిడితో కన్సార్షియంలోని వివిధ దేశాల కంపెనీలు అమెరికన్‌ సంస్థ సబ్‌కామ్‌వైపే మొగ్గు చూపాయి. దీంతో చైనా హెచ్ఎంఎన్ నెట్‌వర్క్‌ పోటీ నుంచి వైదొలిగింది. ప్రాజెక్టు సబ్కామ్‌కే దక్కింది. 

చైనాపై అమెరికా అనుమానాలు
ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకూ సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్‌ వేయడానికి అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్షియానికి పోటీగా ముందుకొచ్చింది చైనా కంపెనీ హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్‌వర్క్‌. హెచ్ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతోపాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది. చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థగా పేర్కొంటూ... 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటులోనూ ఈ కంపెనీని అమెరికాతోపాటు అనేక యూరప్‌ దేశాలు దూరం పెట్టాయి.

సమాచారం అంతటినీ ఈ కంపెనీ చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందనేది ఆరోపణ. తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థపైనా హువావే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందన్నది అమెరికా వాదన. ఈ కేబుళ్ల ద్వారా ప్రసారమయ్యే డేటాను, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను, మిలిటరీ సమాచారాన్ని... చైనా ప్రభుత్వం గుప్పిట పెట్టుకునే ప్రమాదముంది అంటోంది.

చైనా కంపెనీలు సైబర్, టెలికాం నెట్‌వర్క్‌ ద్వారా నిఘా వేస్తున్నాయనేది అగ్రరాజ్యం అనుమానం. గతంలో అమెరికా కంపెనీలు చైనా టెలికాం పరికరాలు వాడటానికి వీలుండేది. 2021 తర్వాత నుంచి దేశ భద్రతకు ముప్పంటూ చైనా టెలికాం పరికరాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఉపసంహరించింది.

అంతేగాకుండా చైనా టెలికాం కంపెనీలు అమెరికాగడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం కూడా విధించింది. తాజాగా సామదానభేద దండోపాయాలను ప్రయోగించి.. ఆసియా-ఐరోపా ఇంటర్నెట్‌ కేబుల్ లైన్‌ ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీలను తప్పించి.. తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్‌ చేశారు.. ఫొటో వైరల్‌

మరిన్ని వార్తలు