ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!

28 Mar, 2022 21:30 IST|Sakshi

మీరు ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్య గమనిక. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొత్తగా అమలులోకి రానున్న పీఎఫ్ నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షలకు పైన ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పీఎఫ్ మొత్తంపై ట్యాక్స్ పడనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. 

2021 ఆగస్ట్ 31న సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 2.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం పన్ను పడుతుంది. అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. యజమానులు పీఎఫ్ కంట్రిబ్యూట్ చేయనప్పుడు ఈ పరిమితి సంవత్సరానికి రూ.5 లక్షలుగా ఉంటుంది. రూ.2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ కలిగిన వారు పీఎఫ్ ఖాతాను రెండు విభాగాలుగా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రూ.2.5 లక్షల వరకు ఒక అకౌంట్‌లో, మిగతా డబ్బులు మరో అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఈ అదనపు అకౌంట్‌పై ట్యాక్స్ పడుతుంది. 

కొత్త పీఎఫ్ నిబంధనలు:

  • ప్రస్తుతం ఉన్న పీఎఫ్ ఖాతాలను పన్ను పరిధిలోకి వచ్చే కంట్రిబ్యూషన్ అకౌంట్లు, నాన్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్ అకౌంట్లుగా విభజించనున్నారు.
  • ప్రావిడెంట్ ఫండ్ వార్షిక కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే అప్పుడు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసుకోవాలి. ఒక అకౌంట్‌లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ లిమిట్‌కు మించిన డబ్బులు మరో అకౌంట్‌లో డిపాజిట్ చేయాలి. దీని వల్ల పన్ను లెక్కింపు సులభతరం అవుతుంది.
  • కొత్త పీఎఫ్ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి.
  • ఏడాదికి రూ.2.5 లక్షలకు మించిన ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఆదాయంపై కొత్త పన్ను విధించేందుకు ఐటీ నిబంధనలకు కొత్త సెక్షన్ 9డీని తీసుకొచ్చింది.

(చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్‌ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!)  

మరిన్ని వార్తలు