New Tax Regime: కొత్త పన్ను విధానంతో మధ్యతరగతికి మరింత మేలు: నిర్మలా సీతారామన్‌

12 Feb, 2023 10:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త పన్ను విధానంతో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని ద్వారా మధ్యతరగతి వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతుందన్నారు. ఆర్బీఐ కేంద్ర బోర్డుతో సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడులు పెట్టే విధంగా  ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం లేదని, పెట్టుబడులపై వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం వారికి కల్పించాలన్నారు. డబ్బు సంపాదించి, ఇంటిని నడిపించే వ్యక్తికి తన డబ్బును ఎక్కడ పెట్టాలో, ఎలా ఆదా చేసుకోవాలో బాగా తెలుసున్నారు.

స్టాండర్డ్‌ డిడక‌్షన్‌కు అవకాశం కల్పించడంతోపాటు మారిన శ్లాబులు, పన్ను రేట్లతో సగటు పన్ను చెల్లింపుదారుడి చేతిలో ఎక్కువ డబ్బు మిగులుతుందన్నారు. కొత్త బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ నూతన పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి 50వేల స్టాండర్డ్‌ డిడక‌్షన్‌ ప్రతిపాదించారు. పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అలాగే రాయితీలతో కూడిన పన్ను విధానంలోనూ పన్ను శ్లాబ్‌ రేట్లను పునర్‌వ్యవస్థీకరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.3 లక్షల వరకు వార్షికాదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని, పన్ను విధానాన్ని సరళీకరిస్తామన్న మాటను నిలబెట్టుకుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

అదానీ గ్రూప్‌ సంక్షోభంపై మంత్రి స్పందిస్తూ.. దేశంలోని నియంత్రణ సంస్థలు ఎంతో అనుభవం కలిగినవని, పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీ అంశంపై మాట్లాడుతూ బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ ఆస్తులపై నియంత్రణకు సంబంధించి ఉమ్మడి అభిప్రాయం కోసం జీ20 దేశాల సమావేశాల్లో చర్చిస్తామన్నారు.

మరిన్ని వార్తలు