కొత్త పన్ను విధానం.. ఎవరికి?

27 Feb, 2023 04:54 IST|Sakshi

ఏటా బడ్జెట్‌లో భాగంగా ప్రకటించే ఆదాయపన్ను శ్లాబు రేట్లు, మినహాయింపుల్లో మార్పుల గురించి తెలుసుకోవాలని వేతన జీవులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ఆదాయపన్ను చట్టంలోని 1961 కింద ప్రభుత్వం ఆఫర్‌ చేస్తున్న పన్ను మినహాయింపులు, తగ్గింపుల ఆధారంగానే వేతన జీవుల పన్ను ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. 2023–24 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్‌ సంవత్సరం 2024–25) నుంచి నూతన పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనుక పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. 

పన్నుల్లో మార్పులు 
నూతన పన్ను విధానంలో బేసిక్‌ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. అలాగే, వార్షిక పన్ను ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ కల్పించారు. రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనాన్ని నూతన పన్ను విధానానికి కూడా విస్తరించారు.

అంటే రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. అలాగే, 37 శాతంగా ఉన్న గరిష్ట సర్‌చార్జీని 25 శాతానికి తగ్గించారు. రూ.5 కోట్లకు పైగా పన్ను ఆదాయం ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను రేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి దిగొచ్చింది.  

మినహాయింపులు/తగ్గింపులు 
పాత పన్ను విధానంలో కొన్ని సాధనాలను వినియోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో లేవు. సెక్షన్‌ 80టీటీఏ/80టీటీబీ, లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్, హౌస్‌ రెంట్‌ అలవెన్స్, పిల్లల స్కూల్‌ ట్యూషన్‌ ఫీజులు, సెక్షన్‌ 10 (14) కింద ప్రత్యేక అలవెన్స్‌లు, అలాగే సెక్షన్‌ 80సీ, 80డీ, 80ఈలు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, సొంతంగా నివసిస్తున్న ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులపైనా (సెక్షన్‌ 24) మినహాయింపు ప్రయోజనం ఉంది.  

అదనపు ప్రయోజనాలు 
నూతన పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. ఇవి పాత పన్ను విధానంలో లేవు. ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన (వైకల్య బాధితులు) వారికి ఇచ్చే రవాణా అలవెన్స్, కన్వేయన్స్‌ అలవెన్స్, బదిలీ సమయంలో అయ్యే వ్యయాలు, ఎన్‌పీఎస్‌కు సంస్థలు చేసే జమలు (సెక్షన్‌ 80సీసీడీ(2)), రూ.50వేల స్టాండర్డ్‌ డిడక్షన్, అడిషనల్‌ ఎంప్లాయీ కాస్ట్‌ (సెక్షన్‌ 80జేజేఏ) ప్రయోజనాలు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. కుటుంబ పెన్షన్‌ ఆదాయం కోసం చేసే వ్యయాలకు సెక్షన్‌ 57 (ఐఐఏ) కింద బడ్జెట్‌లో పన్ను ప్రయోజనం కల్పించారు. అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌కు సెక్షన్‌ 80సీసీహెచ్‌ (2) కింద ఇచ్చే విరాళాలకూ పన్ను మినహాయింపు ప్రకటించారు.  

మదింపు తర్వాతే.. 
పన్ను చెల్లింపుదారు తప్పకుండా తమకు వచ్చే ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం, పన్ను తగ్గింపుల గురించి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అంచనా వేయాలి. ఈ మదింపు ఆధారంగా అనుకూలమైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఇచ్చే జీవిత బీమా పథకాలు, పెన్షన్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఇష్టం లేని వారికి కొత్త పన్ను విధానం అనుకూలంగా ఉంటుంది.

ఈక్విటీలు, ఇతర పెట్టుబడి సాధనాల ద్వారా మెరుగ్గా నిర్వహించుకునే వారికి కూడా నూతన విధానమే ప్రయోజనం. సెక్షన్‌ 80సీ, 80డీ, హెచ్‌ఆర్‌ఏ లేదా గృహ రుణం కింద ప్రయోజనాలు కోరుకునే వారు పాత విధానంలోనే కొనసాగొచ్చు. ఇలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయకుండా, పన్ను భారం తగ్గాలని కోరుకునే వారికి నూతన పన్ను విధానం అనుకూలం.

 - అమర్‌ దియో సింగ్‌  అడ్వైజరీ హెడ్‌ ఏంజెల్‌ వన్‌

మరిన్ని వార్తలు