స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..

14 Feb, 2022 08:35 IST|Sakshi

స్థిరాస్తి వ్యవహారాల మీద టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌)కి సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మొన్నటి బడ్జెట్‌లో తాజా ప్రతిపాదనల సారాంశం మీకోసం.. ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్‌ వర్తిస్తుంది. ఇక నుం చి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) ఆ విలువ రూ. 50,00,000 దాటితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం మీద 1 శాతం టీడీఎస్‌ చేయాలి. క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కించడానికి ప్రతి ఫలం విషయంలో ఇదే రూలు ఉంది.. అమ్మకపు విలువ ఎక్కువ? స్టాంపు డ్యూటీ విలువ ఎక్కు వ? ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇప్పుడు టీడీఎస్‌కి ఈ నిబంధన తెచ్చారు. సాధారణంగా బయట మన కు కనిపించేది.. స్టాంప్‌ డ్యూటీ విలువ తక్కువ ఉంటుంది. నిజంగా ఇచ్చే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్, వైట్‌ వ్యవహారం ఉంటుంది.  

ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా. ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60,00,000కు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే స్టాంపు డ్యూటీ రూ. 72,00,000 అనుకోండి.. పాత రూల్స్‌ ప్రకారం రూ. 60,00,000 మీద టీడీఎస్‌ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. 72,00,000 మీద 1 శాతం చొప్పున టీడీఎస్‌ చేయాలి. దీనివల్ల టీడీఎస్‌ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ప్రతిఫలం ఎక్కువ, మూలధన లాభం .. ఫలితంగా పన్ను ఎక్కువ వసూలు చేయవచ్చు. ఇది రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. విలువ రూ. 50,00,000 దాటితేనే వర్తిస్తుంది. అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండూ రూ. 50,00,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్‌ ప్రశ్న ఉండదు. విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్‌ రూల్స్‌ వర్తిస్తాయి.  

దీని వల్ల ఎక్కువ పన్ను ఖజానాలోకి వచ్చి పడుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్‌ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్‌ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్‌ మొత్తం రిఫండ్‌ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు, గవర్నమెంటు ఖజానాలో ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్‌ వసూలు చేసి అసెస్‌మెంట్‌ తర్వాత వెనక్కు ఇస్తుంది. మొదటి నుంచి ఇదే పాలసీ.. పన్ను వసూళ్లను టీడీఎస్‌ రూపంలో ఆదిలోనే వసూలు చేయటం ఆనవాయితీ.   


కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి; కె.వి.ఎన్‌లావణ్య
ట్యాక్సేషన్‌ నిపుణులు 

మరిన్ని వార్తలు