ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్‌ హోం’ అక్కడే పదేళ్లు పండగ!

26 Oct, 2022 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండోనేషియా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త వీసాను తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సెకండ్‌ హెమ్‌ వీసా’ ప్రోగ్రామ్‌ను తీసు కొచ్చింది.  ఈ వీసా ద్వారా పర్యాటకులు బాలిలో  గరిష్టంగా 10 సంవత్సరాలు నివసించవచ్చు. అంతేకాదు  ఈ వీసాతో, విదేశీయులు  ఐదు లేదా  పదేళ్ల పాటు పెట్టుబడి, ఇతర కార్యకలాపాలు వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా  సంపన్న వర్గాలు ఈ వీసా ద్వారా దీర్ఘకాలికంగా ఇక్కడ  బస చేవయచ్చని  ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. బాలి సహా అనేక ఇతర  పాపులర్‌ టూరిస్ట్‌ ప్రదేశాలకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే దీని లక్ష్యం అని ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ విడోడో ఏకత్జాజానా మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. ఈ విధానం క్రిస్మస్ రోజున లేదా కొత్త నిబంధన జారీ చేసిన 60 రోజుల తర్వాత అమలులోకి వస్తుందని తెలిపారు. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా  కొంతమంది విదేశీయులకు ఇది ఆర్థికేతర ప్రోత్సాహకమని విడోడో ఎకత్జాజానా వ్యాఖ్యానించారు.  తాజా ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాల్లో  కనీసం 130,000 డాలర్లు (కోటి 60 లక్షల రూపాయలకు పైనే) ఉన్నవారు  కొత్త “సెకండ్ హోమ్ వీసా” పొందడానికి అర్హులు. ఆ  దేశ అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్  ద్వారా నిబంధనలకు ప్రకారం ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

విమానయాన సంస్థ ఇండోనేషియా గరుడ అంతర్జాతీయ విమానాలను పునః ప్రారంభించడంతో ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజు కోనుందని భావిస్తున్నారు. దీనికి తోడు బాలిలో నవంబర్‌లో జరిగే G-20 సమ్మిట్‌కు  ‍ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు తరలి రానున్నారు. దీంతో భారీ ఆదాయాన్ని ఇండోనేషియా ఆశిస్తోంది. 

మరిన్ని వార్తలు