రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

21 Apr, 2022 01:46 IST|Sakshi

ఆగ్రో కెమికల్‌ సంస్థ నిచినో ఇండియా ఎండీ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆగ్రో కెమికల్స్‌ ఉత్పత్తి సంస్థ నిచినో ఇండియా రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది సుమారు రూ. 650 కోట్లుగా ఉందని, ఏటా 18–20 శాతం మేర వృద్ధి సాధిస్తున్నామని సంస్థ ఎండీ తమూకా నౌహిరో తెలిపారు. దాదాపు 71 ఉత్పత్తులతో దేశీయంగా క్రిమిసంహారకాల మార్కెట్లో తమకు 2–3 శాతం వాటా ఉందని, దేశవ్యాప్తంగా 2,500, తెలుగు రాష్ట్రాల్లో 1,200 మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. వరి సాగులో సుడి దోమ సమస్య పరిష్కారానికి ఆర్కెస్ట్రా పేరిట క్రిమిసంహారకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు.

వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునేందుకు ఇది రైతులకు తోడ్పడగలదని సంస్థ సీవోవో డీజీ శెట్టి తెలిపారు. జపాన్‌ సంస్థ నిహాన్‌ నొయాకూ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ అయిన నిచినో ఇండియాకు.. తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డితో పాటు దేశీయంగా మొత్తం నాలుగు ప్లాంట్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు