రికవరీ ఆశలతో.. రికార్డులు

1 Jun, 2021 02:12 IST|Sakshi

ఇంట్రాడే, ముగింపులో ఆల్‌టైం హైకి నిఫ్టీ

సెన్సెక్స్‌ లాభం 515 పాయింట్లు రాణించిన మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక షేర్లు

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు

ముంబై: ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఒక శాతం లాభంతో ముగిసింది. మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ రికార్డుల పర్వం కొనసాగింది. ఇంట్రాడేలో 268 పాయింట్లు ఎగసి 15,606 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టస్థాయిని నమోదుచేసింది. చివరికి 147 పాయింట్ల లాభంతో 15,583 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి నిఫ్టీకి ఆల్‌టైం హై కావడం విశేషం. మరో సూచీ సెన్సెక్స్‌ 515 పాయింట్లు లాభపడి 51,937 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడేలో 52 వేల మార్కును అధిగమించి 52,013 స్థాయిని తాకింది. సెన్సెక్స్‌కిది నాలుగోరోజూ లాభాల ముగింపు కాగా నిఫ్టీ సైతం ఏడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతతో ఉదయం సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికిలోనైనా.., దేశీయంగా నెలకొన్న సానుకూలతలతో తిరిగి లాభాల బాటపట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,412 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.180 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు.  

‘‘కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో ఆశావాదం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ తగినంత మద్దతు లభించింది. ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికపు జీడీపీ గణాంకాలు మెప్పించకపోయినా.., లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో వేగవంతమైన రికవరీ జరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగిన వృద్ధి జరగవచ్చు. ఆర్థిక వృద్ధి ఆశలతో మెటల్, ప్రైవేట్‌ బ్యాంక్స్, ఇంధన రంగాలకు చెందిన హెవీ వెయిట్స్‌ షేర్లు రాణించడంతో సూచీలు భారీ లాభాల్ని ఆర్జించగలిగాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

4 రోజుల్లో రూ.3.93 లక్షల కోట్లు అప్‌...
నాలుగు రోజుల వరుస ర్యాలీలో బీఎస్‌ఈలో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.  ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.223 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం సూచీల 1% ర్యాలీతో రూ.1.82 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు.  

రూపాయి మూడురోజుల ర్యాలీకి బ్రేక్‌..!
రూపాయి విలువ సోమవారం 17 పైసలు నష్టపోయి 72.62 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం రూపాయి కరిగిపోయేందుకు కారణమైనట్లు ఫారెక్స్‌ నిపుణులు తెలిపారు. రూపాయి పతనంతో మూడురోజుల ర్యాలీకి ముగింపుపడినట్లైంది. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 72.38 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72.65 – 72.34 శ్రేణిలో కదలాడింది. ఈ మే నెలలో డాలర్‌ మారకంలో రూపాయి 149 పైసలు(2.01 శాతం) బలపడింది.  

మార్కెట్లో మరిన్ని విశేషాలు...  
► అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు 3%  లాభంతో రూ.2,160 వద్ద స్థిరపడింది. గత 4 రోజుల్లో ఈ షేరు 10% ర్యాలీ చేయడం విశేషం.  
► నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో ఫార్మా దిగ్గజం దివిస్‌ ల్యాబ్‌ షేరు 4% లాభపడి రూ.4,284 వద్ద ముగిసింది.  
► మార్కెట్‌ ర్యాలీలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 6% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు