15,700 దిగువకు నిఫ్టీ

24 Jun, 2021 07:56 IST|Sakshi

ముంబై: సూచీల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కొనసాగుతూనే ఉంది. తొలుత కొనుగోళ్లతో లాభాలను ఆర్జించడటం.., తర్వాత అమ్మకాలు జరిగి నష్టాలను చవిచూడటం... బుధవారం ట్రేడింగ్‌లోనూ ఇదే జరిగింది. ఇంట్రాడేలో 323 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ చివరికి 283 పాయింట్లు పతనమైన 52,306 వద్ద స్థిరపడింది. దీంతో ఈ సూచీ మూడురోజుల లాభాలకు విరామం పడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 90 పాయింట్లును ఆర్జించింది. మార్కెట్‌ ముగిసే సరికి 86 పాయింట్లు నష్టంతో 15,687 వద్ద నిలిచింది. ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు జరిగాయి. మెటల్, ఐటీ, ప్రైవేట్‌ రంగాల షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు అరశాతం క్షీణించాయి. ట్రేడింగ్‌లో సెనెక్స్‌ 648 పాయింట్ల శ్రేణిలో, నిఫ్టీ 189 పాయింట్ల పరిధిలో కదలాడాయి.

సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఇటీవల మార్కెట్‌ ర్యాలీలో భాగంగా షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌ను 13.9% నుంచి తొమ్మిది శాతానికి కుదించింది. అలాగే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ అంశాలూ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,157 కోట్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1317 కోట్ల షేర్లను కొన్నారు.


ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం..!? 
ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు నేడు(గురువారం) అప్రమత్తత వహించవచ్చు. మార్కెట్‌ ఇప్పటికీ సాంకేతికంగా బలంగా ఉండటంతో ట్రేడర్లు జూలై ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్‌ చేసుకునే వీలుంది. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ వార్షిక సభ్య సమావేశం(ఏజీఎం)ఉంది. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు కదలికలు సూచీల గమనాన్ని నిర్ధేశించగలవు. ఈ పరిణామాల దృష్ట్యా స్టాక్‌ మార్కెట్లో నేడు ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

చదవండి మరోమైలు రాయిని చేరిన ఎల్‌ఐసీ

మరిన్ని వార్తలు