నిఫ్టీ @ 17,000

1 Sep, 2021 04:45 IST|Sakshi

57000 శిఖరంపైన సెన్సెక్స్‌ 

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు

ఆశావహ స్థూల ఆర్థిక గణాంకాల నమోదుపై ఆశలు

కలిసొచ్చిన రూపాయి ర్యాలీ 

ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద

ముంబై: స్టాక్‌ మార్కెట్లో మంగళవారమూ రికార్డుల మోత మోగింది. ఆర్థిక వృద్ధి ఆశలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ నాలుగోరోజూ బలపడి మార్కెట్‌ జోరుకు మరింత ప్రోత్సాహం అందించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో తడబడినా.., తదుపరి స్థిరమైన ర్యాలీ చేయడంతో సెన్సెక్స్‌ తొలిసారి 57000 మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా మొదటిసారి 17000 శిఖరంపై నిలిచింది. మీడియా షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 735 పాయింట్ల ర్యాలీ చేసి 57625 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది.

చివరికి 663 పాయింట్లు లాభంతో 57,552 వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో రిలయన్స్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్, నెస్లే షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌ సూచీ 223 పాయింట్లు ఎగసి 17,154 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి 201 పాయింట్ల లాభంతో 17,132 వద్ద స్థిరపడింది. మెటల్‌ షేర్ల ర్యాలీ కొనసాగడంతో ఎన్‌ఎస్‌ఈలో రెండోరోజూ నిఫ్టీ మెటల్‌ సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లకు చెప్పుకోదగిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా షేర్లలో బలమైన రికవరీ ర్యాలీ కనిపించింది. అయితే మిడ్, స్మాల్‌ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,881 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,872 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.  

‘‘జీడీపీతో పాటు ఇతర దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే ఆశలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ఫెడ్‌ చైర్మన్‌ సానుకూల వ్యాఖ్యలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లను ప్రారంభించడం మార్కెట్‌కు మరింత జోష్‌నిచ్చాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ దీపక్‌ జషానీ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► అంతర్జాతీయ మార్కెట్లో్ల చక్కెర ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో షుగర్‌ షేర్లు ఐదు శాతం వరకు ర్యాలీ చేశాయి.  
► టారిఫ్‌ల పెంపు, నిధుల సమీకరణ అంశాలపై కంపెనీ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌  వివరణ ఇవ్వడంతో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 7% లాభపడి రూ.664 వద్ద ముగిసింది.  
► అల్యూమినియం ధరలు పదేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో హిందాల్కో షేరు 4.5% లాభపడి రూ.468 వద్ద స్థిరపడింది.

సంపద @ రూ.250 లక్షల కోట్లు
దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ దూకుడుతో ఇన్వెస్టర్లు సంప దగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ తొలిసారి రూ. 250 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ నాలుగు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో రూ.8.48 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.7 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.

29 రోజుల్లో 1000 పాయింట్ల ర్యాలీ...  
నిఫ్టీ ఈ ఆగస్ట్‌ 3వ తేదీన తొలిసారి 16000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి సరిగ్గా 28 రోజుల్లో (ఆగస్ట్‌ 31 తేది నాటికి) ఏకంగా 1000 పాయింట్లు ఎగసి 17000 స్థాయిని అందుకుంది. వెయ్యి పాయింట్ల ర్యాలీకి నిఫ్టీ తీసుకున్న అతి తక్కువ సమయం ఇది. కాగా, ఈ ఆగస్ట్‌లో ఎనిమిది శాతం లాభపడింది.

మరిన్ని వార్తలు