కొనుగోళ్లకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు, లాభాల్లో దేశీ స్టాక్‌ మార్కెట్లు

7 Oct, 2022 07:01 IST|Sakshi

ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. ఇన్వెస్టర్లు ప్రారంభంలోనే కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 513 పాయింట్లు ఎగసి 58,579కు చేరింది. చివరికి 157 పాయింట్ల లాభంతో 58,222 వద్ద ముగిసింది. తొలుత 17,428ను దాటిన నిఫ్టీ సైతం 58 పాయింట్లు జమ చేసుకుని 17,332 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకోవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.  ఈ ఉత్సాహం రెండో రోజూ కొనసాగడంతో మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కదిలినట్లు విశ్లేషించారు. 

మెటల్స్‌ జోరు..:
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్, మీడియా, రియల్టీ, ఐటీ 3.2–1.6 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.4 శాతం డీలాపడ్డాయి. బ్లూచిప్స్‌లో జేఎస్‌డబ్ల్యూ, సీఐఎల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫీ, యాక్సిస్, 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇండస్‌ఇండ్, దివీస్, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్‌ ఫైనాన్స్, బ్రిటానియా 2.6–1 శాతం మధ్య క్షీణించాయి. 

స్టాక్‌ హైలైట్స్‌ 
రూ. 1,000 కోట్ల అదనపు అత్యవసర రుణ సహాయం అందనున్న వార్తలతో చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 42 వద్ద ముగిసింది. 

కొన్ని షరతులకులోబడి సోనీ పిక్చర్స్‌తో విలీనానికి సీసీఐ అనుమతించడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌  4.6% ఎగసి రూ. 281 వద్ద ముగిసింది. 

ఉత్తర అమెరికా నుంచి క్లాస్‌8 ట్రక్కుల ఆర్డర్లు పెరగడంతో భారత్‌ ఫోర్జ్‌ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 763 వద్ద ముగిసింది.

రూ‘పాయే’: 82.17 
రూపాయి రికార్డుల పతనం ఆగట్లేదు. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం మొదటిసారి భారీగా 55 పైసలు నష్టపోయి 82 దిగువన 82.17 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ పటిష్టత, క్రూడ్‌  ధరలు స్థిరంగా ఉండడం దీనికి కారణం. రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో 20 పైసలు లాభపడి 81.62 వద్ద ముగిసింది. దసరా సందర్బంగా బుధవారం మార్కెట్‌కు సెలవు. గురువారం కొంత సానుకూలంగా 81.52 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.51ని చూసినా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది.  

మరిన్ని వార్తలు