వెంటాడిన కరోనా భయాలు.. ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్‌!

13 May, 2021 00:08 IST|Sakshi

సూచీలకు రెండోరోజూ నష్టాలే  

49 వేల దిగువకు సెన్సెక్స్‌ 

154 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్‌ రెండో రోజూ వెనకడుగు వేసింది. మెటల్, ఆర్థిక, ఐటీ షేర్లతో పాటు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బుధవారమూ సూచీలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 471 పాయింట్లు పతనమై 49 వేల దిగువున 48,691 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 154 పాయింట్లను కోల్పోయి 14,696 వద్ద నిలిచింది. ఇప్పటికీ అదుపులోకి రాని కరోనా కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఏ దశలో సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఒక దశలో సెన్సెక్స్‌ 610 పాయింట్లు క్షీణించి 48,551 వద్ద, నిఫ్టీ 250 పాయింట్లను కోల్పోయి 14,650 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాల ట్రేడింగ్‌లోనూ ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌ షేర్లకు రాణించాయి. అలాగే ఎంపిక చేసుకున్న కొన్ని ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మారు. సంస్ధాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) కూడా రూ.704 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 8 పైసలు బలహీనపడి 73.42 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతలు... 
అంతర్జాతీయంగా స్టీల్, అల్యూమినియం, రాగి వంటి కమోడిటీ ధరలు రికార్డు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తలెత్తాయి. పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే ఆందోళనలు తెరపైకి వచ్చాయి. అలాగే బాండ్‌ ఈల్డ్‌ (రాబడులు) పెరగవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఒకటిన్నర శాతం నష్టంతో ముగిశాయి. ఆసియాలో బుధవారం చైనా, హాంకాంగ్‌ మినహా మిగిలిన అన్ని దేశాలకు మార్కెట్లు పతనమయ్యాయి.  

ఎదురీదీన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు 
మార్కెట్‌ ట్రెండ్‌కు భిన్నంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. నేడు(గురువారం) వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంక్స్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పీఎన్‌బీ, యూకో బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్, పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 10–5 % ర్యాలీ చేశాయి. జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్, ఐఓబీ, మహారాష్ట్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు మూడు నుంచి ఒక శాతం ర్యాలీ చేశాయి. ఫలితంగా నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 3.30 శాతం లాభంతో ముగిసింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
స్టీల్‌ కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగింది. టాటా స్టీల్‌ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.1179 వద్ద స్థిరపడింది.  
పదిహేను నెలల తర్వాత తొలిసారి ఏప్రిల్‌లో యూజర్లు పెరగడంతో వోడాఫోన్‌ ఐడియా షేరు 9% లాభపడి రూ.9 వద్ద ముగిసింది.  
మార్చి క్వార్టర్‌లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో పాటు కొత్త సీఈవో నియామకాన్ని చేపట్టడంతో గోద్రేజ్‌ కన్జూమర్‌ షేరు 22 శాతం లాభపడి రూ.873 వద్ద నిలిచింది.   
మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఐఎ క్స్‌ ఇండెక్స్‌ ఒకశాతానికి పైగా పెరిగి 20.98 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు