సూచీలకు రెండోరోజూ నష్టాలు

11 Nov, 2022 06:49 IST|Sakshi

ముంబై: ఫెడ్‌ వడ్డీరేట్లను నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఈక్విటీ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు తలెత్తడంతో సూచీలు రెండో రోజూ డీలాపడ్డాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా ఆటో, ఫైనాన్స్, ఇంధన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

ఫలితంగా సెన్సెక్స్‌ 419 పాయింట్లు నష్టపోయి 60,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్లు పతనమై 18,028 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఒకశాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ ఒకటిన్నర శాతం చతికిలపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.36 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.967 కోట్ల షేర్లను అమ్మేశారు. ట్రేడింగ్‌ నష్టాలను భర్తీ చేసుకున్న రూపాయి ఏడు పైసలు స్వల్పంగా బలపడి 81.40 వద్ద స్థిరపడింది.

ఆసియా, యూరప్‌ మార్కెట్లు 1–2శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ రెండు రోజుల్లో 571 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.3.1 లక్షల కోట్లు సంపద కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.281.60 లక్షల కోట్లకు దిగివచ్చింది.  

భారీ లాభాల్లో అమెరికా మార్కెట్లు  
అమెరికా అక్టోబర్‌ వినియోగ ధరల(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆర్థికవేత్తల అంచనా(8%)ల కంటే తక్కువగా 7.7 శాతానికి దిగివచ్చిందని (గురువారం రాత్రి) కార్మిక శాఖ వెల్లడించింది. పరుగులు తీస్తున్న ధరలు నెమ్మదించడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా యూఎస్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రధాన సూచీలైన డోజోన్‌ 3%, ఎస్‌అండ్‌పీ 3.50%, నాస్‌డాక్‌ ఏకంగా ఐదుశాతం లాభంతో కదలాడుతున్నాయి.  

ట్రేడింగ్‌లో 18 వేల దిగువకు నిఫ్టీ  
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 509 పాయింట్ల నష్టంతో  60,524 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు క్షీణించి 18,044 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కీలక రంగాల్లో తలెత్తిన అమ్మకాలతో సూచీలు ఏ దశలో కోలుకోలేకపోయాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 609 పాయింట్లు పతనమై 60,425 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17,969 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.  

మార్కెట్లో మరిన్ని సంగతులు 
సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల ప్రకటన మరుసటి రోజు టాటా మోటార్స్‌ షేరు డీలాపడింది. బీఎస్‌ఈలో 5 శాతం నష్టపోయి రూ.412 వద్ద నిలిచింది.  

 లిస్టింగ్‌ తరువాత లాకిన్‌ పీరియడ్‌ ముగియడంతో నైకా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది.   ఈ కొత్త తరం టెక్‌ షేరు చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.188 వద్ద నిలిచింది.

>
మరిన్ని వార్తలు