Nifty: సరికొత్త శిఖరాలకు నిఫ్టీ

29 May, 2021 00:54 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు రాణించడంతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ సూచీ 308 పాయింట్లు లాభపడి 51,423 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 51,259 – 51,529 పాయింట్ల మధ్యలో ట్రేడైంది. మరో ఇండెక్స్‌ నిఫ్టీ మూడు నెలల విరామం తర్వాత ఇంట్రాడేలో 15,469 వద్ద సరికొత్త రికార్డును లిఖించింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,436 వద్ద ముగిసింది.

ఈ ముగింపు స్థాయి కూడా నిఫ్టీకి రికార్డు గరిష్టం. అలాగే ఆరోరోజూ లాభాలను గడించినట్లైంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.914 కోట్ల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు రూ.661 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 882 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పెరిగాయి. ‘‘దేశంలో కోవిడ్‌ వ్యాధి సంక్రమణ రేటు క్షీణించడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ పతనం భారత ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడుతూ ర్యాలీకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థిక రికవరీ ఆశలు, మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్‌ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ మోదీ తెలిపారు.

సూచీలకు మద్దతుగా రిలయన్స్‌ ర్యాలీ...  
అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు చాలాకాలం తరువాత లాభాల బాట పట్టింది. జెఫ్పారీస్‌తో సహా బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేరుకు బుల్లిష్‌ రేటింగ్‌ను కేటాయించాయి. ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేందుకు ఆసక్తి చూపారు. ఎన్‌ఎస్‌ఈలో 6% లాభంతో రూ. 2,095 వద్ద స్థిరపడింది.

>
మరిన్ని వార్తలు