నిఫ్టీ కొత్త రికార్డ్‌

3 Feb, 2024 06:22 IST|Sakshi

మళ్లీ 72 వేల స్థాయికి సెన్సెక్స్‌ 

రాణించిన రిలయన్స్, ఐటీ షేర్లు

కలిసొచ్చిన ప్రపంచ మార్కెట్ల రికవరీ 

ఇంట్రాడేలో 2% ర్యాలీ

బ్యాంకులు, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ 

జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద   

ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్‌ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి.

నిఫ్టీ ఆల్‌టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్‌ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్‌ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్‌డాక్‌లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్‌ స్టాక్‌ సూచీలు 0.5–1% మేర పెరిగాయి.
 
► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్‌ వారంలో సెన్సెక్స్‌ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి.  
► సెన్సెక్స్‌ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.  
► కేంద్రం బడ్జెట్‌లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్‌  క్రూడాయిల్‌ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ
చి్చంది. బీపీసీఎల్‌ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్‌ పెట్రోలియం 5%, ఓఎన్‌జీసీ 4%, కోల్‌ ఇండియా 3% లాభపడ్డాయి.  
► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్‌ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.   
► పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్‌ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్‌బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్‌ సర్క్యూట్‌ తాకింది. బీఎస్‌ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు