12,000 సమీపంలో నిలిచిన నిఫ్టీ

9 Oct, 2020 16:16 IST|Sakshi

మార్కెట్లకు బ్యాంకింగ్‌ రంగం దన్ను

327 పాయింట్లు అప్‌- 40,509కు సెన్సెక్స్‌

80 పాయింట్ల జమతో 11,914 వద్ద ముగిసిన నిఫ్టీ

రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు డీలా

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం మైనస్‌

వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్‌ 327 పాయింట్లు జంప్‌చేసి 40,509 వద్ద నిలవగా.. నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 11,914 వద్ద ముగిసింది. తద్వారా 12,000 పాయింట్ల మైలురాయికి సమీపంలో స్థిరపడింది. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో మార్కెట్లు పాలసీ ప్రకటన తదుపరి మరింత బలపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,067 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 11,939- 11,805 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్‌-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. క్యూ4 నుంచీ జీడీపీ రికవరీ బాట పట్టనున్నట్లు అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అవసరమైతే మరిన్నివిధాన చర్యలకు సిద్ధమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఐటీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. ఐటీ 0.7 శాతం పుంజుకుంది. అయితే ఫార్మా, రియల్టీ, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 1.6-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, గెయిల్‌, శ్రీ సిమెంట్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటో, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌ 4.4-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గ్రాసిమ్‌, హిందాల్కో, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ లైఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బ్రిటానియా, దివీస్‌, అల్ట్రాటెక్‌ 2.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఫైనాన్స్‌ జోరు
డెరివేటివ్స్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐబీ హౌసింగ్‌, పీఎన్‌బీ, బీవోబీ, మైండ్‌ట్రీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యూబీఎల్‌, హావెల్స్‌, కెనరా బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఇండిగో, వేదాంతా, బంధన్‌ బ్యాంక్‌ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. బయోకాన్‌, జీ, కమిన్స్‌, టాటా కన్జూమర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బాలకృష్ణ, ఐజీఎల్‌, టొరంట్ ఫార్మా, ఎంఆర్‌ఎఫ్‌ 3.8-2.3 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,230 లాభపడగా.. 1454 నష్టపోయాయి. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 978 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 20 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు