ఈ స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు

28 Nov, 2022 08:58 IST|Sakshi

స్మాల్‌క్యాప్‌ అంటే అధిక రిస్క్, అధిక రాబడులతో కూడిన విభాగం. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌తో పోలిస్తే అస్థిరతలు ఎక్కువ. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, మార్కెట్‌ కల్లోలాల్లో ఈ విభాగంలో ఎక్కువ నష్టాలు ఎదురవుతుంటాయి. చిన్న కంపెనీలు లిక్విడిటీ తక్కువతో ఉంటాయి. కనుక, కొంచెం అమ్మకాల ఒత్తిడికే స్టాక్స్‌ ధరలు ఎక్కువగా నష్టపోతుంటాయి. అందుకని ఈ విభాగంలో దీర్ఘకాలానికి మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెట్టడం, అస్థిరతల సమయాల్లో ఆ పెట్టుబడులను ధైర్యంగా కొనసాగించడం కేవలం నిపుణులైన ఫండ్‌ మేనేజర్లకే సాధ్యపడుతుంది. 

కనుక రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి బదులు మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను నమ్ముకోవడం మంచిది. ఈ విభాగంలో నిప్పన్‌ ఇండియా స్మాల్‌క్యాప్‌ ఫండ్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డు ఉంది.  
రాబడులు  

పెట్టుబడిదారులకు మంచి రాబడులను తెచ్చి పెట్టడంలో ఈ పథకం అన్ని కాలాల్లోనూ ముందుంటోంది. ఇతర పథకాలతో, స్మాల్‌క్యాప్‌ సూచీ, విభాగంతో పోల్చినా మెరుగైన ప్రతఫలాన్నిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 11 శాతం రాబడినిచ్చింది. కానీ, ఇదే కాలంలో బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్‌ టీఆర్‌ఐ, ఈక్విటీ స్మాల్‌క్యాప్‌ విభాగం సగటు రాబడి 1.5 శాతంలోపే ఉండడాన్ని ఇన్వెస్టర్లు విస్మరించరాదు. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 35 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. దీన్ని అద్భుత రాబడిగానే చూడొచ్చు. ఇక గడిచిన ఐదేళ్ల కాలంలో 16.43 శాతం, ఏడేళ్లలో 19.38 శాతం, పదేళ్లలో 24.44 శాతం చొప్పున వార్షిక రాబ­డిని తీసుకొచ్చింది. గడిచన పదేళ్ల­లో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 250 సూచీ రాబడి ఏటా 13 శాతంగా ఉంటే, స్మాల్‌క్యాప్‌ విభాగం సగటు వార్షిక రాబడి 18 శాతంగా ఉండడం గమనార్హం.  
 
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తను పాటిస్తుంటుంది. అందుకే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్‌ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 159 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. అన్ని రకాల మార్కెట్‌ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్‌ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. 

అలాగే, ఏదో ఒక రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టే విధానానికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోను గమనిస్తే.. క్యాపిటల్‌ గూడ్స్‌లో 15 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ 12.53 శాతం, కెమికల్స్‌ 11 శాతం, కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌ కంపెనీల్లో 9 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.22,844 కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటే.. ఈ పథకం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.62 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 17 శాతాన్ని లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. 34 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌నకు కేటాయించగా, 49 శాతం పెట్టుబడులు స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు