ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీకి కేంద్రం భారీ షాక్‌!

1 Jan, 2023 10:37 IST|Sakshi

బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి భారీ షాక్‌ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్‌ మోదీని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది. 

కటకటాల్లోకి 
మార్చి 2019లో భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనల మేరకు లండన్‌లో ఉన్న  నీరవ్‌ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్థానిక వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే జైలు శిక్షను అనుభవిస్తున్నారు.  

ఆస్తుల వేలం
ఈ నేపథ్యంలో పూణేలో ఉన్న నీరవ్‌ ప్రాపర్టీలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆక్షన్‌ పక్రియ ప్రారంభం కానుందని, ముంబైకి చెందిన డెబిట్‌ రికవరీ ట్రైబ్యూనల్‌-ఐ (డీఆర్టీ-ఐ) విభాగం ఈ వేలం చేపట్టనుంది. రికవరీ అధికారి అషుకుమార్‌ ఆదేశాలతో నీరవ్‌కు చెందిన రెండు ప్రాపర్టీలపై ఈ- ఆక్షన్‌ జరగనుంది. 

అధికారుల దర్యాప్తు ముమ్మరం 
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రుణం పేరుతో వేలకోట్ల ఆర్ధిక మోసాలకు పాల్పడ్డ నీరవ్‌ మోడీ, మోహిల్‌ చోక్సీలు ప్రధాన నిందితులు. ఇద్దరు బ్యాంకుల్లో వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో భారత ప్రభుత్వం నిందితులకు ఇచ్చిన రుణాల్ని తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది. 

ప్రాప్టరీ విలువ ఎంతంటే 
విచారణ కొనసాగుతుండగానే పూణేలోని హదప్‌సర్‌లో ఉన్న యో పూణే హౌసింగ్‌ స్కీమ్‌లోని 398 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఎఫ్‌ 1 భవనంలోని 16వ అంతస్తు... ఆ పక్కనే 396 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరో ప్లాట్‌ ధరల్ని రూ. 8.99కోట్లు, రూ. 8.93 కోట్లుగా నిర్ణయించారు. వాటినే వేలం వేయనున్నారు.  

నోటీసులు జారీ 
వేలంపై అధికారులు ఇప్పటికే నీరవ్‌కు చెందిన స్టెల్లార్‌ డైమండ్స్‌, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డైమండ్‌ ఆర్‌ యూఎస్‌, ఏఎన్‌ఎం ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌డీఎం ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు