పీఎన్‌బీ స్కాం సంచలనం : నీరవ్‌కు భారీ షాక్‌

6 Jan, 2021 17:32 IST|Sakshi

పీఎన్‌బీ కుంభకోణంలో కీలక పరిణామం

అప్రూవర్లుగా నీరవ్‌ సోదరి, బావ

సాక్షి, ముంబై: బ్యాంకింగ్‌ రంగాన్ని పట్టికుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ  కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్‌ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ  కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్‌గా  మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి  భారీ షాక్‌ తగిలింది.

పీఎన్‌బీ స్కాం, నీరవ్‌ నుంచి  తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోదీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ  కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు స్థంభించి పోయాయని వాపోయారు.  ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో  వీరిని  ప్రాసిక్యూషన్ సాక్షులుగా  ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు  అనుమతించింది.  క్షమాపణ  తెలిపిన తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోడీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం  బెల్జియం  పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్వి మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)  అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా పీఎన్‌బీ స్కాంలో  నీరవ్ మోడీ , అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు  పత్రాలతో పీఎన్‌బీని రూ .14 వేల కోట్లకు ముంచేశాడు.  అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్‌ జైల్లో ఉన్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అంశం విచారణలో ఉంది.

మరిన్ని వార్తలు