నిర్మా గ్రూప్‌ నువోకో ఐపీవోకు రెడీ

5 Aug, 2021 02:08 IST|Sakshi

ధరల శ్రేణి షేరుకి రూ. 560–570

ఈ నెల 9–11 మధ్య పబ్లిక్‌ ఇష్యూ

రూ. 5,000 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: నిర్మా గ్రూప్‌నకు చెందిన సిమెంట్‌ రంగ కంపెనీ నువోకో విస్టాస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 9న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 560–570గా కంపెనీ ప్రకటించింది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్‌ సంస్థ నియోగీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. 

రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  నువోకో విస్టాస్‌ ఐదు సమీకృత, ఐదు గ్రైండింగ్, ఒక బ్లెండింగ్‌ యూనిట్‌తోపాటు 11 సిమెంట్‌ ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం వార్షికంగా 22.32 ఎంఎంటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, హర్యానాలలో సిమెంట్‌ తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. గతంలో లఫార్జ్‌ ఇండియాగా కార్యకలాపాలు సాగించిన కంపెనీ 2020 ఫిబ్రవరిలో ఇమామీ గ్రూప్‌ సిమెంట్‌ బిజినెస్‌ను కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు