ప్రభుత్వం – పరిశ్రమ మధ్య విశ్వాసం ఉండాలి

14 Sep, 2021 06:20 IST|Sakshi

అప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోగలం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి పరిస్థితుల్లో తెరపైకి వచి్చన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య నమ్మకం కీలకమైన అంశంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు టీకాల ప్రక్రియను వేగవంతం చేస్తూనే మరోవైపు ప్రైవేట్‌ రంగం తోడ్పాటుతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు సహా అన్ని చోట్లా ఆరోగ్య సంబంధ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంని ఆమె చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్సింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్‌ మొదలైనవి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించగలవని ఆమె తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు.   

ఫిక్కీతో సమావేశం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం వాణిజ్య మండలి ఫిక్కీతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఇందులో 50 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఎన్నో అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇండియా సిమెంట్స్‌ చైర్మన్, ఎండీ ఎన్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. చైనా తర్వాత సిమెంట్‌ తయారీలో భారత్‌ అతిపెద్ద దేశంగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లో సగం మేర సిమెంట్‌ దక్షిణాదిలోనే తయారవుతోందని.. మౌలిక సదుపాయాల రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టనున్న దృష్ట్యా దేశంలోని ఇతర ప్రాంతాలకూ సిమెంట్‌ తయారీ విస్తరణ అవసరాన్ని ప్రస్తావించారు. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధర గణనీయంగా పెరిగిపోవడాన్ని చర్చకు తీసుకువచ్చారు. తోలు పరిశ్రమలో ఎంఎస్‌ఎంఈలే ఎక్కువగా ఉన్నందున.. వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్‌ తర్వాత కూడా కొనసాగించాలని ఫిక్కీ తమిళనాడు ఎగ్జిమ్‌ ప్యానెల్‌ కన్వీనర్‌ ఇర్షద్‌ మెక్కా కోరారు. దీంతో అన్ని అంశాలపైనా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు