ఎకానమీకి మరింత జోష్‌..

13 Nov, 2020 05:00 IST|Sakshi

ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 ఉద్దీపన

కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు

మరిన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు

గృహ విక్రయ డీల్స్‌పై పన్ను సంబంధ ప్రయోజనాలు

రూ. 30 లక్షల కోట్ల స్థాయికి మొత్తం ఉద్దీపన ప్యాకేజీ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 కింద మరిన్ని చర్యలు  ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

పటిష్టంగా రికవరీ...
దీర్ఘకాలం లాక్‌డౌన్‌ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు.  

ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన..
కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్‌ ఫండ్‌పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్‌ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.

అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్‌ సభ్యులు, కరోనా వైరస్‌ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్‌ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 2021 జూన్‌ 30 దాకా ఈ స్కీమ్‌ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది.

ఈసీఎల్‌జీఎస్‌ మార్చి దాకా పొడిగింపు...
వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్‌ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్‌ రంగానికి కూడా ఈ స్కీమ్‌ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు.  

రియల్టీకి తోడ్పాటు...
గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్‌ డ్యూటీ సర్కిల్‌ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ  43సీఏ ప్రకారం.. సర్కిల్‌ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా..  బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి.  

రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ ..
ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్‌ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా.  

మరిన్ని చర్యలు..
► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు.
► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్‌ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్‌ 31 దాకా వర్తింపు.
► కోవిడ్‌–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు.
► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు.
► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు.
► డిఫెన్స్, ఇన్‌ఫ్రా కోసం బడ్జెట్‌ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. 

>
మరిన్ని వార్తలు