ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులే ఆయుధం

10 Sep, 2020 06:47 IST|Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

వ్యాపారంతోపాటు సంక్షేమంపైనా దృష్టి పెట్టాలని పిలువు

ముంబై: ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులదీ కీలక పాత్ర అని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇంటింటికీ బ్యాంకింగ్‌ సేవలకు సంబంధించి పీఎస్‌బీ అలయెన్స్‌ కార్యక్రమాన్ని బుధవారం ఆమె ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువకావడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడారు.  బ్యాంకింగ్‌ తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు ఆర్థికవృద్ధి, సంక్షేమం పట్ల కూడా దృష్టి కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంర్భంగా అన్నారు. ‘‘ రుణాలు ఇవ్వడం... తద్వారా డబ్బు సంపాదించడం. ఇది మీ చట్టబద్ధమైన కార్యక్రమం. దీనిని మీరు మర్చిపోవక్కర్లేదు. మీరు మీ విధిని నిర్వహించాల్సిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంపైనా బ్యాంకింగ్‌ దృష్టి పెట్టాలి’’ అని ఆమె అన్నారు.  

ప్రైవేటు బ్యాంకుల సహకారం అవసరం
ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రైవేటు రంగంలోని బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆర్థికమంత్రి అన్నారు. బ్యాంకుల ద్వారా అమలు జరిగే ప్రభుత్వ పథకాల వివరాలు అన్నింటినీ సిబ్బంది తెలుసుకోవాలని ఆమె అన్నారు. ‘‘పలు పథకాలను కేంద్రం మీ ద్వారానే ప్రజలకు అందిస్తుంది. అందువల్ల ఈ పథకాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవడమూ మీ బాధ్యతే. ఉద్యోగులకు సంబంధించి ప్రతి స్థాయిలో ఆయా అంశాలను తెలుసుకుంటారని భావిస్తున్నా’’ అని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే ప్రజలకు బ్యాంకింగ్‌ మరింత చేరువవుతుందన్నారు. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బ్యాంకింగ్‌ సేవల విస్తరణకు ఉద్దేశించిన పీఎస్‌బీ అలయెన్స్‌ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా కూడా చిత్రంలో ఉన్నారు

మరిన్ని వార్తలు