త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్మలా సీతారామన్‌ భేటీ

10 Nov, 2021 08:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబర్‌ 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో సమావేశం కానున్నారు. దేశంలో రుణ లభ్యత, ఆర్థిక వ్యవస్థ పురోగతి తత్సంబంధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా సమీక్ష జరపనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

ఆర్థికాభివృద్ధికిగాను ఉత్పాదక రంగాలకు రుణ లభ్యతను పెంచాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు సూచించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌సహా పలు ప్రభుత్వ పథకాలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. బ్యాంకర్లతోపాటు వివిధ మంత్రిత్వశాఖలు సీనియర్‌ అధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా మౌలిక, వ్యవసాయ సంబంధిత విభాగాల అధికారులు ఆయా రంగాలు ఎదుర్కొంటున్న రుణ సవాళ్లను బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళతారని సమాచారం. 

చర్చించే అంశాలివి... 

భారత్‌ బ్యాంకింగ్‌ ‘క్రెడిట్‌ అవుట్‌రీచ్‌’ కార్యక్రమం నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. అక్టోబర్‌ 16న ప్రారంభమైన ఈ పథకం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్‌ ఇటీవలే ఒక ట్వీట్‌లో తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580  శిబిరాలను నిర్వహిస్తున్నాయి. దీనిపై సమావేశంలో దృష్టి సారించే వీలుంది. 

బ్యాంకింగ్‌ రంగం పురోగతి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన రిస్ట్రక్చరింగ్‌ 2.0 స్కీమ్‌ అమలు,  రూ. 4.5 లక్షల కోట్ల  అత్యవసర రుణ హామీ పథకం స్కీమ్‌ (ఈసీఎల్‌జీఎస్‌) పునరుద్ధరణ వంటి అంశాలపై సమీక్షించవచ్చు. 

మొండిబకాయిల సమస్యపై కూడా సమావేశం దృష్టి సారించే అవకాశం ఉంది.  మొండిబకాయిలు 2019 మార్చి 31 నాటికి రూ.7,39,541 కోట్లకు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు,  ఆపై 2021 ముగిసే నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చాయని, తన వ్యూహాలు, సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంటోంది. గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల రికవరీ జరిగినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.  

ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్ట్‌ నేపథ్యంలో ఈ అంశాన్ని బ్యాంకర్లు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. బ్యాంకర్లు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది.  

చదవండి: ప్రపంచ దేశాలన్ని భారత్‌ను ప్రశంసిస్తున్నాయి: సీతారామన్

>
మరిన్ని వార్తలు