పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం

17 Aug, 2021 00:32 IST|Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఆయిల్‌ బాండ్లపై వడ్డీ భారమే కారణమని వివరణ  

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ సుంకాలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందని ఆమె సూచనప్రాయంగా పేర్కొంటూ, ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్సైజ్‌ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని అన్నారు.

ఇంధనం కొనుగోళ్లు–వ్యయాల మధ్య ఉన్న వ్యత్యా సాన్ని తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలకు యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్‌ బాండ్లకు సంబంధించి గత ఏడేళ్లలో  ప్రభుత్వంపై రూ. 70,196 కోట్లకుపైగా వడ్డీ భారం పడిందని, ఇంకా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆయిల్‌  బాండ్ల భారాన్ని భరిం చాల్సిన స్థితి లేకపోయినట్లయితే, ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే పరిస్థితిలో ఉండేవాళ్లం’’ అని ఆమె ఈ సందర్భంగా వివరించారు.  రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్‌ బాండ్ల విలువలో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే ఇప్పటివరకూ చెల్లించడం జరిగిందన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఇంకా రూ.1.3 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. పెట్రోల్‌పై ప్రస్తు తం లీటర్‌కు రూ.32.90 ఎక్సైజ్‌ సుంకం భారం పడుతుండగా, డీజిల్‌పై ఇది రూ.31.80గా ఉంది.  

పెట్రోలియం ప్రొడక్టులు...
పెట్రోలియం ప్రొడక్టులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోనికి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీతారామన్‌ తెలిపారు. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. జీఎస్‌టీకి రాష్ట్రాలు అంగీకరిస్తే, ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఒకే పన్నుగా మారతాయి. ద్వంద్వ పన్నుల విధానానికి (ఎక్సైజ్‌ సుంకంపై వ్యాట్‌ విధింపు) ఇది ముగింపు పలుకుతుంది.  

రెట్రో ట్యాక్స్‌పై త్వరలో నిబంధనలు
రెట్రో పన్ను రద్దు నేపథ్యంలో పరిస్థితుల నిర్వహణకు త్వరలో నియమ నిబంధనలు తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. రెట్రో పన్న రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్‌ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్‌ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. రెట్రో ట్యాక్స్‌ కేసుల ఉపసంహరణ, రిఫండ్, వివాద పరిష్కారంపై తన శాఖ అధికారులు కెయిర్న్, వొడాఫోన్‌లతో చర్చిస్తున్నట్లు కూడా ఆర్థికమంత్రి తెలిపారు. రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్‌ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి.

వివాద పరిష్కారాలకు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ విధా నాన్ని ప్రవేశపెట్టింది.  స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్‌ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ వివాదాలకు ముగింపు పలికేందుకు  రెట్రో ట్యాక్స్‌ను ఈ నెలారంభంలో రద్దు చేయాలని నిర్ణయించింది.   

ద్రవ్యోల్బణం అదుపులోకి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం నిర్దేశిత 2–6 శ్రేణిలో అదుపులోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికమంత్రి వ్యక్తం చేశారు.  
ఆదాయాలు పెరుగుతాయ్‌: రానున్న నెలల్లో ప్రభుత్వ ఆదాయాలు భారీగా పెరుగుతాయన్న భరోసాను ఆర్థికమంత్రి ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ), ప్రత్యక్ష పన్నులు గత కొన్ని నెలలుగా పెరిగాయని అన్నారు.

ఐటీ పోర్టల్‌ సమస్యలు త్వరలో పరిష్కారం
ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్‌ల దాఖలు విషయంలో ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు కొద్ది వారాల్లో పరిష్కారం అవుతాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంలో తాను పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌తో నిరంతరం చర్చిస్తున్నట్లు వివరించారు. ఇన్ఫోసిస్‌ హెడ్‌ నందన్‌ నీలేకని కూడా ఈ మేరకు హామీ ఇస్తూ తనకు నిరంతరం సందేశాలను పంపుతున్నట్లు పేర్కొన్నారు.   కొత్త ఆదాయపు పన్ను 2 ఫైలింగ్‌ పోర్టల్‌ అభివృద్ధికి సంబంధించి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది.  2019 జనవరి నుంచి జూన్‌ 2021 మధ్య ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్‌టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు నిధుల  మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.

వొడాఫోన్‌పై ‘చర్చలు’
వొడాఫోన్‌ ఐడియా కుప్పకూలకుండా ప్రభుత్వం ఒక మార్గాన్ని అన్వేషిస్తుందన్న వార్తల నేపథ్యంలో సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా మంది అధికారులు ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు’’అని చెప్పారు. అయితే ఏ విషయం తన వద్దకు రాలేదని ఆమె స్పష్టం చేశారు. చర్చలు జరుపుతున్నది ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లభించకపోతే వొడాఫోన్‌ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్‌ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్‌ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు