క్యాష్‌ విత్‌డ్రా, శ్మశాన వాటికల జీఎస్టీపై మంత్రి నిర్మలా సీతారామన్‌ క్లారిటీ

2 Aug, 2022 21:11 IST|Sakshi

పిల్లల స్టేషనరీ నుంచి పాలు,పెరుగు ప్యాకెట్లపై కేంద్రం జీఎస్టీ విధించింది. జులై 18 నుంచి వాటిపై జీఎస్టీ వసూలు చేస్తుంది. ఈ వసూళ్లపై సామాన్యులు కేంద్రంపై ఆగ్రహం వ్యక‍్తం చేస్తున్నారు. ఈ  తరుణంలో జరుగుతున్న రాజ్యసభ సమావేశాల్లో విధించిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగించారు. ఆమె ఏం చెప్పారంటే..      

బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణపై జీఎస్టీ లేదు. 

ప్రింటర్ నుండి బ్యాంక్ కొనుగోలు చేసిన చెక్ బుక్‌పై మాత్రమే జీఎస్టీ వసూలు చేస్తున్నాం.   

 ప్యాక్ చేసిన, లేబుల్ వేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై ప్రసంగిస్తూ.. ప్రతి రాష్ట్రంలో ప్యాకేజీ ఫుడ్‌పై ట్యాక్స్‌ ఉంటోందన్న విషయాన్ని ప్రస్తావించారామె.  

హాస్పిటల్ బెడ్‌లు, ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)పై జీఎస్టీ లేదని, రోజుకు రూ. 5000 అద్దె ఉన్న గదులపై మాత్రమే పన్ను విధిస్తున్నట్లు చెప్పారు. 

పేదలు తీనే ఏ ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధించలేదన్నారు.  5 శాతం జీఎస్టీ  విధింపు అనేది ముందుగా ప్యాక్ చేసిన , లేబుల్ వేసిన వస్తువులపై మాత్రమేనని అన్నారు. 

ప్రతి రాష్ట్రం తృణధాన్యాలు, పప్పులు, పెరుగు, లస్సీ, మజ్జిగతో పాటు ఇతర ఆహార పదార్థాలపై పన్ను విధిస్తున్నాయని, ఆహార పదార్థాలపై జీఎస్టీ  విధించడాన్ని నిర్మలా సీతారామన్‌ సమర్థించుకున్నారు.

శ్మశాన వాటికలపై జీఎస్టీ లేదని, కొత్త శ్మశాన వాటిక నిర్మాణాలపై మాత్రమే పన్ను విధింపు ఉంటుందని ఆమె తెలిపారు.

రాజ్యసభలో ద్రవ్యోల్బణంపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ, ఇతర దేశాలలో ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావిస్తూ ఆర్బీఐ, ప్రభుత్వం చేసిన ప్రయత్నం వల్ల మనం ఇప్పుడు 7 శాతం ద్రవ్యోల్బణం రేటు వద్ద ఉన్నామని అన్నారు. ద్రవ్యోల్బణం లేదని మేము చెప్పడం లేదని, అదే సమయంలో ధరల పెరుగుదలను ఎవరూ తిరస్కరించడం లేదని చెప్పారు. 

మరిన్ని వార్తలు