2022–23 బడ్జెట్‌..దూసుకుపోనున్న దేశ ఆర్థిక వ్యవస్థ: నిర్మలా సీతారామన్‌!

30 Mar, 2022 09:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి సవాళ్ల అనంతరం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రీతిలో కోలుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ చొరవలు వృద్ధి మరింత దూసుకుపోడానికి దారితీస్తాయని ఆమె ఉద్ఘాటించారు. రాజ్యసభలో ఈ మేరకు ఆమె ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

 ఆర్థిక వ్యవస్థకు ఊపందుకోవడం కోసం ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. సూక్ష్మ స్థాయిలో అందరినీ కలుపుకొని పోయే విధంగా సంక్షేమం, డిజిటల్‌ ఎకానమీ, ఫిన్‌టెక్, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఎనర్జీ ట్రాన్సిషన్, పర్యావరణ పరిరక్షణా విధానాలకు పెద్దపీట వేస్తోంది. ఈ చొరవలు పెట్టుబడులు, వృదికి దోహదపడతాయి.  

► వృద్ధికి  ప్రభుత్వ రోడ్‌ మ్యాప్‌ 2014లో అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (ఐబీసీ)కార్పొరేట్‌ పన్ను రేటులో గణనీయమైన తగ్గింపు సహా ప్రధాన సంస్కరణలు అమలులోకి వచ్చాయి.  2014–20 మధ్య కాలంలో జీడీపీ వార్షిక సగటు రేటు 6.8 శాతం వృద్ధికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. 

► ఆర్థిక వృద్ధిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు ఎన్నో ప్రయోజనాలను ఒనగూర్చనుంది.  

భారత ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి 2022–23 కేంద్ర బడ్జెట్‌ దోహదపడుతుంది. వృద్ధికి సంబంధించి ఇది తాజా రోడ్‌ మ్యాప్‌. బడ్జెట్‌లోని ప్రధానమంత్రి గతిశక్తి పథకాన్ని ఇక్కడ కీలకంగా ప్రసావించుకోవాలి. జాతీయ మౌలిక సదుపాయాల పురోగతికి దోహదపడే అంశం.  

► మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతోనే ఏప్రిల్‌ 1వ తేదీతో ప్రారంభమయ్యే 2022–23 వార్షిక బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)తో పోలిస్తే  35 శాతంపైగా అధిక మూలధన కేటాయింపులు జరిగాయి. 

► వృద్ధికి సంబంధించి ప్రభుత్వ తాజా రోడ్‌ మ్యాప్‌లో  సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పనితీరును వేగవంతం చేయడం, ఆయా చర్యల అమలు కీలక అంశాలు. ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ గడువు పొడిగింపు, మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ కోసం క్రెడిట్‌ గ్యారెంటీ ట్రస్ట్‌ను పునరుద్ధరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.  

►  ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్‌ఈజెడ్‌) కొత్త చట్టంతో మరింత పటిష్టం చేయడం  ’మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం పురోగతికి దోహదపడే అంశం.  

ప్రభుత్వ బ్యాంకుల మూలధనానికి ఢోకాలేదు...
ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌యూ) కేంద్రం ఎప్పటికప్పుడు తగిన మూలధన కేటాయింపులు జరుపుతోందని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కే కరాద్‌ రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2,86,043 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చిందని తెలిపారు.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల క్యాపిటల్‌ టు రిస్క్‌–వెయిటెడ్‌ అసెట్స్‌ రేషియో (సీఆర్‌ఏఆర్‌) గత మూడేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. ఇది 2018–19 చివరి నాటికి 12.20 శాతం ఉంటే,  2021 డిసెంబర్‌ 31 నాటికి 14.34 శాతానికి పెరిగిందని వెల్లడించారు. 2021 డిసెంబర్‌ 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగినంత మూలధనం పొందాయి’’ అని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు