Income Tax Day 2022: రూ.14 లక్షల కోట్లు వసూళ్లు చేశాం: నిర్మలా సీతారామన్‌

25 Jul, 2022 08:47 IST|Sakshi

పన్నుల ఆదాయంలో వృద్ధి 

పన్ను రిటర్నులు సైతం పెరుగుదల 

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమ్మకంతో కూడిన పన్ను వ్యవస్థ మంచి ఫలితాలనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పన్ను వసూళ్లు పెరగడమే కాకుండా, పన్ను రిటర్నులు కూడా అధిక సంఖ్యలో దాఖలవుతున్నట్టు చెప్పారు. 163వ ఆదాయపన్ను దినోత్సవం సందర్భంగా మంత్రి తన సందేశాన్నిచ్చారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.14 లక్షల కోట్ల వసూళ్లను సాధించినందుకు ఆదాయపన్ను శాఖను అభినందించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పన్ను వసూళ్లలో ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.2021–22లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.14.09 లక్షల కోట్లుగా నమోదు కాగా, వార్షికంగా చూస్తే 49 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.14.20 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి చాన్నాళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించినట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమవంతుగా విశ్వసనీయమైన పన్ను విధానాన్ని సమర్థించినట్టు చెప్పారు. టెక్నాలజీ వినియోగంతో పన్ను చెల్లింపుదారులకు సేవలను ఇతోధికం చేసినట్టు వివరిస్తూ.. పారదర్శకతను పెంచినట్టు తెలిపారు. వచ్చే 25 ఏళ్ల కాలానికి వృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆదాయపన్ను శాఖకు సూచించారు.

చదవండి: Elss Scheme: అదీ సంగతి.. ఈ స్కీమ్‌లో ఏ విభాగమైనా, పీపీఎఫ్‌ కంటే రెట్టింపు రాబడులు! 


  

మరిన్ని వార్తలు