భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు ‘గిగ్‌’లోనే లభిస్తాయట

27 Jun, 2022 17:10 IST|Sakshi

ఒకప్పుడు ఉద్యోగమంటూ డిగ్రీ పట్టా చేతపట్టుకుని పదుల కొద్ది ఇంటర్యూలకు హాజరవ్వాలి. ఉద్యోగం దొరికితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసుల్లో కూర్చుని పని చేయాలి. కానీ ఇప్పుడు జమానా మారింది. ఉద్యోగం కావాలంటే డిగ్రీలు అక్కర్లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉండక్కర్లేదు. నచ్చినప్పుడు నచ్చినంత సేపు పని చేస్తే చాలు జీవనోపాధి చేతిలో ఉన్నట్టే. నిజమే ఈ కామర్స్‌ రంగం పుంజుకున్నకా మనకు కనిపించే డెలివరీ బాయ్స్‌ చేసేది ఇదే పని. వీళ్లను గిగ్‌ వర్క్‌ఫోర్స్‌గా పిలుచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అధిక ఉపాధి అందించేదిగా గిగ్‌ ఎకానమీ రూపుదిద్దుకోబోతుంది.

ఏకంగా 2.35 కోట్లు
నీతి అయోగ్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2029-30 నాటికి దేశంలో వర్క్‌ఫోర్స్‌లో గిగ్‌ వర్కర్ల సంఖ్య ఏకంగా 2.35 కోట్లకు చేరనుంది. దీంతో గిగ్‌ వర్క్‌ఫోర్స్‌ వాటా ఏకంగా 4.1 శాతానికి చేరుకోనుంది. వ్యవసాయేతర రంగాలను పరిగణలోకి తీసుకుంటే గిగ్‌ఫోర్స్‌ వాటా ఏకంగా 6.7 శాతంగా ఉంటుందని నీతి అయోగ్‌ అంటోంది. రాబోయే రోజుల్లో ఈ దేశ యువతకు ఉపాధికి అతిపెద్ద దిక్కుగా గిగ్‌ ఎకానమీ అవతరించనుంది.

ప్రస్తుతం 77 లక్షలు
నీతి అయోగ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం వివరాలను పరిశీలిస్తే... గిగ్‌ వర్క్‌ఫోర్స్‌గా దేశంలో 77 లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా రిటైల్‌ అండ్‌ సేల్స్‌ విభాగంలో 26 లక్షల మంది, ట్రాన్స్‌పోర్టేషన్‌లో 13 లక్షల మంది, ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సురెన్సులో 6.3 లక్షల మంది, మాన్యుఫ్యాక్చరింగ్‌లో 6.2 లక్షల మంది, ఎడ్యుకేషన్‌లో లక్ష మంది ఉపాధి పొందుతున్నట్టుగా తేలింది.

పెద్ద దిక్కుగా గిగ్‌
గిగ్‌ ఎకానమీలో ఉపాధి పొందుతున్న వర్క్‌ఫోర్స్‌ నైపుణ్యాలను పరిశీలిస్తే.. ఇందులో అత్యధిక మంది మీడియం స్కిల్డ్‌ వర్కర్లుగా తేలారు. వీరి వాటా 47 శాతంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో లో స్కిల్డ్‌ కేటగిరీలో 31 శాతం మంది ఉన్నారు. చివరగా హై స్కిల్డ్క్‌ కేటగిరిలో కేవలం 22 శాతం మందే ఉన్నారు. వీటిని పరిశీలిస్తే సాధారణ స్కిల్స్‌ లేదా స్కిల్స్‌ లేని వారికి అతి పెద్ద ఉపాధి వనరుగా గిగ్‌ నిలుస్తోందనే భావన కలుగుతోంది.

చదవండి: మార్కెట్‌లో లాభాలు.. అంతా ఆశామాషీ కాదు గురూ!

మరిన్ని వార్తలు