ఈవీలపై సబ్సిడీతో పాటు ప్రోత్సాహకాలూ ఇవ్వాలి

29 Apr, 2021 14:58 IST|Sakshi

ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సూచనలు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ కీలకమైన సూచనలు చేసింది. ఫేమ్‌-2 పథకం కింద ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై (ఈవీ) ఇస్తున్న సబ్సిడీకి అదనంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. ప్రాధాన్యరంగ రుణ వితరణ విభాగంగా ఈవీలను గుర్తించడంతోపాటు.. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని ఇవ్వాలని కోరింది. వీటికి అదనంగా.. ఈవీల కోసం ప్రత్యేక లేన్లు.. వాణిజ్య సముదాయల వద్ద ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయాలను కల్పించాలని కూడా సూచించడం గమనార్హం. ప్రస్తుతం వాహన విక్రయాల్లో పర్యావరణ అనుకూల ఈవీ, తక్కువ కార్బన్‌ను విడుదల చేసే వాహనాల వాటా 1 శాతంలోపే ఉంది. 

ఇతర సూచనలు..  

  • గ్రీన్‌ జోన్‌లను పట్టణాల పరిధిలో ఏర్పాటు చేసి కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలనే అనుమతించాలి. ఎలక్ట్రిక్‌ బస్సులనే రవాణాకు వినియోగించాలి. 
  • అదే సమయంలో సంప్రదాయ వాహనాలపై అధిక పన్నులు వేయాలి. 
  • ఈవీ చార్జింగ్‌ సదుపాయాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు దేశవ్యాప్త విధానం అవసరం. 
  • చార్జింగ్‌ స్టేషన్ల వద్ద కొంత స్థలంలో కేఫ్‌టేరియా, ఆహార కేంద్రాల ఏర్పాటు ద్వారా అదనపు అదాయానికి అనుమతించాలి. 
  • ఎలక్ట్రిక్‌ రవాణా విభాగానికి రుణాలను సమకూర్చే ఆర్థిక సంస్థలను ప్రోత్సహించాలి.

65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు!

మరిన్ని వార్తలు