electric vehicles: హైవేల వెంట ఈవీ చార్జింగ్‌ వ్యవస్థ: నితిన్‌ గడ్కరీ

2 Oct, 2021 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ:జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిక్‌ వాహనాలకు సౌలభ్యత కలిగించడానికి చార్జింగ్‌ మౌలిక వ్యవస్థను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కొనుగోళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వివరించారు.

ఒక వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌–19 నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న ఆటోమొబైల్‌ పరిశ్రమ, క్రమంగా రికవరీ చెందుతుండడం తనకు సంతోషం కలిగిస్తోందని తెలిపారు. భారత్‌ జీడీపీ వ్యవస్థలో ఆటో రంగం వాటా 7.1 శాతం అని ఆయన పేర్కొంటూ, తయారీ జీడీపీ విషయంలో 49 శాతం వాటా కలిగి ఉందని తెలిపారు. 

వార్షిక టర్నోవర్‌ రూ.7.5 లక్షల కోట్లుకాగా, ఎగుమతుల విలువ రూ.3.5 లక్షల కోట్లని వివరించారు. జూలై 2021లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన అమ్మకాలు నెలవారీగా 229 శాతం పెరిగి 13,345 యూనిట్లకు చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. వార్షికంగా చూస్తే 836 శాతం పురోగతి ఉందని వివరించారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన అంశమని పేర్కొన్నారు. రవాణా రంగం విషయంలో పర్యావరణ పరిరక్షణ విధానాలకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 

చదవండి: ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్.. ధర రూ.40 వేలు మాత్రమే

మరిన్ని వార్తలు