క్యాపిటల్‌ మార్కెట్లకు రోడ్డు ప్రాజెక్టులు

16 Sep, 2022 08:38 IST|Sakshi

న్యూఢిల్లీ: రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఈ నెలలో ప్రభుత్వం క్యాపిటల్‌ మార్కెట్లను ఆశ్రయించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభదాయకం కావడంతో దేశీయంగా రహదారి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇన్సూరెన్స్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. 

రానున్న మూడేళ్లలో జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ ఆదాయం రూ. 1.4 లక్షల కోట్లకు జంప్‌ చేయనున్నట్లు ఒక సదస్సుకు హాజరైన రోడ్‌ రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షికంగా రూ. 40,000 కోట్ల టోల్‌ ఆదాయం లభిస్తోంది. పటిష్ట టోల్‌ ఆదాయం ఆర్జిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐకు ఏఏఏ రేటింగ్‌ ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి భారీ స్పందన లభించనున్నట్లు గడ్కరీ అభిప్రాయపడ్డారు. 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టుల(ఇన్విట్స్‌) ద్వారా నిధులను సమీకరించనున్నట్లు గడ్కరీ గత నెలలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 10 లక్షల పెట్టుబడుల పరిమితిని ప్రకటించారు. త్వరలో ఇన్విట్స్‌ను స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇన్విట్‌ యూనిట్లలో లావాదేవీలు చేపట్టవచ్చని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ను పోలి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన పెట్టుబడులకు ఇన్విట్స్‌లోనూ యూనిట్లను జారీ చేస్తారు.

మరిన్ని వార్తలు