నితిన్‌ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్‌!

3 May, 2022 07:30 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా పెట్రోల్‌ వాహనాల కన్నా ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) చవకగా లభించే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రహదారులు, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. 

మరోవైపు, అమెరికా విద్యుత్‌ కార్ల దిగ్గజం టెస్లా .. భారత్‌లోనే వాహనాలను ఉత్పత్తి చేస్తే ఆ సంస్థకూ ప్రయోజనకరంగా ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఎలన్‌ మస్క్‌ సీఈఓగా ఉన్న టెస్లా తన ఈవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చైనాలో తయారు చేసి, వాటిని ఇక్కడ అమ్ముతామంటేనే సమస్యని గడ్కరీ ఇప్పటికే స్వష్టం చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుతం ఇంజిన్‌ పరిమాణం, ఖరీదును బట్టి దిగుమతి చేసుకునే కార్లపై 60–100%  సుంకాలు ఉంటున్నాయి. అంతిమంగా కారు ఖరీదులో 110% వరకూ దిగుమతి సుంకాల భారం ఉంటోందని, దీన్ని తగ్గించి భారత్‌లో విక్రయించుకునేందుకు అనుమతిస్తే..ఆ నిధులను దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇన్వెస్ట్‌ చేస్తామని టెస్లా చెబుతోంది. అయితే, టెస్లా కోసం నిబంధనలను మార్చడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

చదవండి👉 చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్‌మస్క్‌ - నితిన్‌ గడ్కారీ

మరిన్ని వార్తలు