దేశీ విడిభాగాలకే ప్రాధాన్యమివ్వాలి

26 Feb, 2021 05:25 IST|Sakshi

లోకలైజేషన్‌ 100 శాతానికి పెరగాలి

లేకుంటే దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచాల్సి రావచ్చు

ఏసీఎంఏ సదస్సులో కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు దేశీయంగా తయారైన విడిభాగాల తయారీ, కొనుగోళ్లకు మరింతగా ప్రాధాన్యమివ్వాలని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఆటో విడిభాగాల దిగుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.  ప్రస్తుతం 70 శాతంగా ఉన్న విడిభాగాల లోకలైజేషన్‌ను .. 100 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేని పక్షంలో దిగుమతి చేసుకునే విడిభాగాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలు, ఆటో విడిభాగాల తయారీదారులు స్థానిక పరికరాల కొనుగోళ్లను గరిష్ట స్థాయిలో.. 100 శాతం దాకా పెంచుకోవాలని కోరుతున్నా. ఇలాంటివన్నీ తయారు చేసేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా నినాదానికి దేశీ ఆటో పరిశ్రమ మద్దతుగా నిలిచేందుకు ఇదే సరైన తరుణం‘ అని ఆయన పేర్కొన్నారు.

సెమీకండక్టర్ల తయారీకి తోడ్పాటు కావాలి..
ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు .. ముఖ్యంగా సెమీకండక్టర్లను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సొసైటీ సియామ్‌ ప్రెసిడెంట్‌ కెనిచి అయుకావా కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధించగలని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ దీపక్‌ జైన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు