నాగర్నార్‌ స్టీల్‌విడదీతకు ఓకే

30 Jun, 2022 06:41 IST|Sakshi

ఎన్‌ఎండీసీ వాటాదారులు, రుణదాతలు సై

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంటు(ఎన్‌ఎస్‌పీ)ను విడదీసేందుకు వాటాదారులు, రుణదాతలు అనుమతించినట్లు కంపెనీ సీఎండీ సుమిత్‌ దేవ్‌ తాజాగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా స్టీల్‌ శాఖ ఎన్‌ఎండీసీ వాటాదారులు, రుణదాతలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్‌ఎండీసీ నుంచి ఎన్‌ఎస్‌పీ విడదీతకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు తెలియజేశారు.

చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు దగ్గర్లోగల నాగర్నార్‌లో ఎన్‌ఎండీసీ 3 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ. 23,140 కోట్ల అంచనా వ్యయాలతో 1,980 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2020 అక్టోబర్‌లో ఎన్‌ఎండీసీ నుంచి ఎన్‌ఎస్‌పీని విడదీసేందుకు కేం్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్‌ఎస్‌పీ ప్రత్యేక కంపెనీగా విడివడనుంది. తదుపరి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికిగల పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకి విక్రయించనున్నారు.  

మరిన్ని వార్తలు