వడ్డీరేట్ల మార్పుపై రిజర్వ్‌బ్యాంక్‌ కీలక నిర్ణయం

6 Aug, 2021 10:49 IST|Sakshi

ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్‌ రిపో రేటులపై మానిటరీ పాలసీ కమిటీ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించింది. 

మార్పులేదు
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్‌ రిపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్‌ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.

గాడిన పడుతోంది
వ్యవసాయ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. 

రిపోరేటు
ప్రభుత్వ సెక్యూరిటీలను తన వద్ద ఉంచుకుని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పులు ఇచ్చేప్పుడు వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో వాణిజ్య బ్యాంకులు తన వద్ద డిపాజిట్‌ చేసిన మొత్తానికి ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్‌ రిపో రేటు అంటారు. 
 

మరిన్ని వార్తలు