నవంబర్‌ 17 వరకూ అనిల్‌ అంబానీపై చర్యలు వద్దు

27 Sep, 2022 03:55 IST|Sakshi

‘బ్లాక్‌ మనీ’ కేసులో ఐటీ శాఖకు బాంబే హైకోర్టు ఆదేశాలు

ముంబై: బ్లాక్‌ మనీ చట్టం కింద ఐటీ శాఖ నోటీసులు అందుకున్న రిలయన్స్‌ గ్రూప్‌ (అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్‌ 17 వరకూ ఎటువంటి బలప్రయోగ చర్యలు తీసుకోవద్దని ఆదాయ పన్ను శాఖను న్యాయస్థానం ఆదేశించింది. రెండు స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 814 కోట్ల వివరాలు వెల్లడించకుండా రూ. 420 కోట్ల మేర పన్నులు ఎగవేశారంటూ ఆగస్టు 8న అంబానీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పన్నులు ఎగవేయాలనే ఉద్దేశ్యంతో, ఆయన కావాలనే తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించలేదని ఆరోపించింది.

నోటీసులో పొందుపర్చిన సెక్షన్ల ప్రకారం అనిల్‌ అంబానీకి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ అనిల్‌ అంబానీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట లావాదేవీలు 2006–07 నుంచి 2010–11 మధ్యలో జరిగినవని ఐటీ శాఖ చెబుతుండగా.. బ్లాక్‌మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని ఆయన తరఫు లాయరు రఫిక్‌ దాదా వాదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే ఐటీ కమిషనర్‌ వద్ద సవాలు చేసినట్లు, సివిల్‌ వివాదం పెండింగ్‌లో ఉండగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి లేదని దాదా తెలిపారు. అనిల్‌ అంబానీ పిటిషన్‌పై స్పందించేందుకు కొంత సమయం కవాలని ఐటీ శాఖ కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు