రూపాయి పతనంపై అందోళన అక్కర్లేదు 

20 Jul, 2022 00:20 IST|Sakshi

డాలర్‌తో మారకంపై కేంద్రం భరోసా యత్నం

విలువ తగిన స్థాయిలోనే ఉందన్న డీఈఏ సేథ్‌

యూరో, జపాన్‌ యెన్‌లపై బలపడిందన్న మంత్రి చతుర్వేది 

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి పతనంపై ఆందోళనలను తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. రూపాయి విలువ బాగానే ఉందని, అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ క్షీణతపై ‘మరీ’ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి (డీఈఏ) అజయ్‌ సేథ్‌ మంగళవారం స్పష్టం చేశారు. బ్రిటీష్‌ పౌండ్, జపాన్‌ యెన్, యూరో వంటి అనేక ప్రపంచ కరెన్సీల మారకంలో భారత కరెన్సీ మెరుగ్గా ఉందని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఈ కరెన్సీలలో భారత్‌ దిగుమతుల వ్యయాన్ని చౌకగా మార్చిందని కూడి వెల్లడించారు.

ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చతుర్వేది కూడా రాజ్యసభలో ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడినప్పటికీ బ్రిటిష్‌ పౌండ్, జపాన్‌ యెన్‌ యూరో వంటి ప్రధాన కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి బలపడిందని అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విదేశీ మారకపు మార్కెట్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని, తీవ్ర అస్థిరత పరిస్థితులలో జోక్యం చేసుకుంటుందని ఒక లిఖితపూర్వక సమాధానంలో చతుర్వేది తెలిపారు. ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌ ప్రాతిపదిక పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  (2022–23) జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం మేర నమోదవుతుందన్న ధీమాను రాజ్యసభలో వ్యక్తం చేశారు.  

కారణం ఏమిటంటే... 
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రూపాయి భారీ పతనానికి కారణాన్ని వివరిస్తూ, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును కఠినతరం చేయడం వల్ల డాలర్‌పై రూపాయి పతనమవుతోందని అన్నారు.  ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు వల్ల  ప్రపంచవ్యాప్తంగా డాలర్లు అమెరికాకు ప్రవహిస్తున్నాయని అన్నారు. దీనితో పలు దేశాల కరెన్సీలు పతన బాట పట్టాయని వివరించారు. నిజానికి పలు ఇతర కరెన్సీలతో పోల్చితే భారత్‌ కరెన్సీ పతనం తక్కువేనని అన్నారు.

దేశంలోకి ఫారెక్స్‌ భారీగా రావడానికి ఆర్‌బీఐ రెండు వారాల క్రితమే విస్తృతమైన చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేస్తూ, ఈ దిశలో అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. డాలర్‌ మారకంలో రూపాయి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తీవ్ర ఒడిదుడుకుల నివారణకూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు.  

ఇంట్రాడేలో 80 దాటిన రూపాయి 
ఇదిలాఉండగా, ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో  మొదటిసారి 80 దాటిపోయి, 80.05ను తాకింది. అయితే చివరకు క్రితంతో పోల్చితే 6పైసలు బలపడి 79.92 వద్ద ముగిసింది. రూపాయి విలువ సోమవారం (18వ తేదీ) మొదటిసారి 80ని తాకి చరిత్రాత్మక కనిష్టాన్ని చూసింది. అయితే అటు తర్వాత తేరుకుని 79.98 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ చరిత్రాత్మక కనిష్ట ముగింపు 79.9975. గత గురువారం (14వ తేదీ 18 పైసలు క్షీణతతో) ఈ స్థాయిని తాకింది. 2022లో ఇప్పటి వరకూ డాలర్‌ మారకంలో రూపాయి 7.5 శాతం (563 పైసలు) నష్టపోయింది.  

మరిన్ని వార్తలు