సంక్షోభంపై కరెన్సీ ముద్రణ అస్త్రం యోచన లేదు

27 Jul, 2021 06:22 IST|Sakshi

పార్లమెంటులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌–19 మహమ్మారి విసిరిన సవాళ్లను అధిగమించేందుకు కరెన్సీ నోట్ల ముద్రణ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దృష్టిలో లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాదానం ఇస్తూ, ‘‘నో సర్‌’’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడానికి కరెన్సీ ముద్రణ జరపాలా, వద్దా అన్న అంశంపై ఆర్థికవేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక శాతం మంది కరెన్సీ ముద్రణ సరికాదన్న అభిప్రాయంలో ఉన్నారు. మరికొన్ని అంశాలకు సంబంధించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధాలను పరిశీలిస్తే..

► 2020–21లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణించింది. మహమ్మారి దీనికి ప్రధాన కారణం. తీవ్ర ప్రతికూలతలను కట్టడి చేయడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంది.  
► ఎకానమీ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మూలాలు పటిష్టంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగడంతో తిరిగి రికవరీ క్రియాశీలమవుతోంది. స్వావలంభన్‌ (ఆత్మనిర్భర్‌) భారత్‌ చర్యలు వృద్ధి పురోగతికి దోహదపడుతున్నాయి.  
► స్వావలంభన్‌ భారత్‌ (ఏఎన్‌బీ) కింద ప్రభుత్వం రూ.29.87 లక్షల కోట్ల విలువైన సమగ్ర, ప్రత్యేక ఆర్థిక ఉద్దీపనను ప్రకటించింది.  
► వృద్ధి విస్తృతం, పటిష్టం కావడానికి 2021–22 బడ్జెట్‌లో కేంద్రం పలు చర్యలను  ప్రకటించింది. మూలధన వ్యయాల్లో 34.5 శాతం పెంపు, ఆరోగ్య రంగంలో కేటాయింపులు 137 శాతం పెరుగుదల వంటివి ఇందులో ఉన్నాయి. ప్రజారోగ్యం, ఉపాధి కల్పన వంటి లక్ష్యాల సాధనకు 2021 జూన్‌లో కేంద్రం రూ.6.29 లక్షల కోట్ల సహాయక ప్యాకేజ్‌ ప్రకటించింది.  
► జీడీపీ సర్దుబాటు చేయని స్థిర ధరల వద్ద (నామినల్‌) 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం వృద్ధి నమోదువుతుందని 2021–22 బడ్జెట్‌ అంచనా. ఆర్‌బీఐ తాజా విశ్లేషణల ప్రకారం, వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం. అర్‌బీఐ అంతక్రితం 10.5 శాతం వృద్ధి అంచనాలను 9.5 శాతానికి తగ్గించడానికి మహమ్మారి ప్రేరిత అంశాలే కారణం.  
► వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రెపో ఆపరేషన్స్‌సహా పలు చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటోంది. ముఖ్యంగా లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) తగిన లిక్విడిటీ అందుబాటులో ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.  
► పరారైన ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబట్టడానికి కేంద్రం తగిన అన్ని చర్యలు తీసుకుంటుంది.  
► బ్యాంకింగ్‌లో మొండిబకాయిల సమస్యను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
 

లోక్‌సభలో దివాలా చట్ట సవరణ బిల్లు
దివాల చట్ట సవరణ బిల్లును (ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ట్రప్సీ కోడ్‌– అమెండ్‌మెంట్‌ బిల్లు 2021)  ఆర్థికమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.  రుణ ఒత్తిడిలో ఉన్న లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్రీ–ప్యాకేజ్డ్‌ రిజల్యూషన్‌ పక్రియ సౌలభ్యతను కల్పించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. ఏప్రిల్‌ 4న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌ స్థానంలో ఈ బిల్లును కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతారామన్‌ ప్రవేశపెట్టారు.  రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి  ప్రీ–ప్యాకేజ్డ్‌ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది.

బిజినెస్‌ @ పార్లమెంటు
క్యూ1 పన్ను వసూళ్లలో 86% వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1–ఏప్రిల్‌ నుంచి జూన్‌)లో నికర పన్ను వసూళ్లు 86 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ఇందులో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.46 లక్షల కోట్లయితే, పరోక్ష పన్నుల విషయంలో ఈ పరిమాణం రూ.3.11 లక్షల కోట్లని పేర్కొన్నారు. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (2020 ఇదే కాలంతో పోల్చి) 109 శాతంపైగా పెరిగి రూ.2,46,520 కోట్లకు పెరిగాయని తెలిపారు. నికర పరోక్ష పన్నుల విషయంలో పెరుగుదల 70 శాతం ఉందని వివరించారు.

ఇన్ఫోసిస్‌కు ఇప్పటికి రూ.164.5 కోట్లు
కొత్త ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ అభివృద్ధికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కేంద్రం ఇప్పటికి రూ.164.5 కోట్లు చెల్లించిందని పంకజ్‌ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 జనవరి నుంచి జూన్‌ 2021 మధ్య ఈ చెల్లింపులు జరిపినట్లు వివరించారు.  ఆర్థికశాఖ సహాయమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం రూ.4,242 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది.  నిర్వహణ, జీఎస్‌టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కొన్ని సాంకేతిక లోపాలను  పన్ను చెల్లింపుదారులు, వృతి నిపుణులు, సంబంధిత వ్యక్తులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నిరంతర పరిష్కారానికి ఇన్ఫోసిస్‌ పనిచేస్తోంది.

రూ.8.34 లక్షల కోట్లకు తగ్గిన ఎన్‌పీఏలు
మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం 2021 మార్చి చివరికి రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు దిగివచ్చినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కే కరాద్‌ తెలిపారు. 2020 మార్చి ముగింపునకు ఎన్‌పీఏల భారం రూ.8.96 లక్షల కోట్లని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు బ్యాంకింగ్‌ మొండిబకాయిలు తగ్గడానికి కారణమని వివరించారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, 2018 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ.8,95,601 కోట్లని వివరించారు.

మరిన్ని వార్తలు