దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం

15 Mar, 2022 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలు ఏమి లేవని ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి నేడు రాజ్యసభకు తెలియజేశారు. భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. "ఆర్‌బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీని జారీ చేయదు. ఆర్‌బీఐ చట్టం, 1994 ప్రకారం.. సంప్రదాయ పేపర్ కరెన్సీని మాత్రమే జారీ చేస్తుంది. సంప్రదాయ పేపర్ కరెన్సీకి డిజిటల్ రూపం ఇచ్చి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా తీసుకొని రానున్నట్లు" ఆయన అన్నారు.

ఆర్‌బీఐ ప్రస్తుతం సీబీడీసీని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన మరో సమాధానంలో తెలిపారు. సీబీడీసీని ప్రవేశపెట్టడం వల్ల నగదుపై ఆధారపడటం తగ్గుతుంది, దీంతో ఆ కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చు కూడా మిగిలే అవకాశం ఉన్నట్లు పంకజ్ చౌదరి అన్నారు. నోట్ల ముద్రణ కొంతకాలం తగ్గిందని, 2019-20 కాలంలో రూ.4,378 కోట్ల విలువైన నోట్లు ముద్రిస్తే, ఇది 2020-21లో రూ.4,012 కోట్లకు తగ్గిందని ఆయన తెలిపారు. ఇంకా, ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంఘటనల వల్ల స్వల్పకాలం స్టాక్ మార్కెట్లు అనిశ్చితికి లోనైనా కొలుకుంటాయని ఆయన అన్నారు. 

(చదవండి: ఇక దేశీయ రోడ్ల మీద చక్కర్లు కొట్టనున్న హైడ్రోజన్‌ కార్లు..!)

మరిన్ని వార్తలు