బిస్లెరీని విక్రయించం: రమేష్‌ చౌహాన్‌

21 Mar, 2023 06:26 IST|Sakshi

ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలు లేవు

న్యూఢిల్లీ: ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ బిజినెస్‌ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని వెనుకటితరం పారిశ్రామికవేత్త రమేష్‌ చౌహాన్‌ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు ఎవరితోనూ చర్చలు నిర్వహించడంలేదని తెలియజేశారు. బిస్లెరీ విక్రయానికి నాలుగు నెలలుగా టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో కంపెనీ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బిస్లెరీ కొనుగోలుకి ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని, చర్చలు విరమించుకున్నామని ఇటీవలే టాటా కన్జూమర్‌ ప్రకటించింది. వెరసి టాటాతో డీల్‌ చర్చలకు తెరపడిన మూడు రోజుల తదుపరి చౌహాన్‌ తాజాగా ఇచ్చిన వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. గతేడాది నవంబర్‌లో టాటా కన్జూమర్‌సహా పలు సంస్థలతో బిస్లెరీ విక్రయానికి చర్చలు జరుపుతున్నట్లు చౌహాన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.  

కుమార్తెకు ఆసక్తి లేదు: బిస్లెరీ బిజినెస్‌ను ఇకపై ప్రొఫెషనల్స్‌ హ్యాండిల్‌ చేయవలసి ఉన్నట్లు చౌహాన్‌ వ్యాఖ్యానించారు. అయితే తన కుమార్తె జయంతికి బిస్లేరీ బిజినెస్‌పట్ల ఆసక్తి లేదని తెలియజేశారు. బాటిల్డ్‌ వాటర్‌ విభాగంలో బిస్లేరీ ఇంటర్నేషనల్‌ ప్రధానంగా బిస్లేరీ బ్రాండుతో బిజినెస్‌ నిర్వహిస్తోంది. వేదికా బ్రాండుతో స్ప్రింగ్‌ వాటర్‌ను సైతం అందిస్తోంది. అంతేకాకుండా స్పైసీ, లిమొనాటా, ఫోంజో, పినాకోలాడ బ్రాండ్లతో ఫిజ్జీ డ్రింకులను సైతం ఆఫర్‌ చేస్తోంది. సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్లు థమ్సప్, గోల్డ్‌ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాలను మూడు దశాబ్దాల క్రితం(1993) యూఎస్‌ దిగ్గజం కోకకోలాకు చౌహాన్‌ కుటుంబం విక్రయించిన సంగతి తెలిసిందే. హిమాలయన్‌ బ్రాండుతో ఇప్పటికే టాటా కన్జూమర్‌ బాటిల్డ్‌ వాటర్‌ విభాగంలో బిజినెస్‌ను కలిగి ఉంది. గ్రూప్‌ కంపెనీలు టాటా కెమికల్స్, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ కలయికతో టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఆవిర్భవించింది. హైడ్రేషన్‌ విభాగంలోని టాటా కాపర్‌ ప్లస్‌ వాటర్, టాటా గ్లూకో బ్రాండ్లు సైతం ఈ కంపెనీవే.

మరిన్ని వార్తలు