బిట్‌కాయిన్‌ భవితవ్యంపై లోక్‌సభలో కీలక ప్రకటన

29 Nov, 2021 15:00 IST|Sakshi

క్రిప్టోకరెన్సీపై రకరకాల ఊహాగానాల నడుమ బిట్‌కాయిన్‌ భవితవ్యంపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. 
 

Parliament Winter Session 2021 సోమవారం మొదలైన విషయం తెలిసిందే.  లోక్‌సభ కాసేపు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన తరుణంలో  బిట్‌కాయిన్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేస్తోందా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘అలాంటిదేం లేదు సర్‌’ అని సమాధానం ఇచ్చారు.  

బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ ప్రభుత్వం చేయట్లేదని, అలాగే బిట్‌కాయిన్‌ ట్రాన్‌జాక్షన్స్‌కు సంబంధించి వివరాలు సేకరించామన్న రిపోర్టులు నిజం కాదని ఆమె స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న బిట్‌కాయిన్‌ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైంది. ఇక ఆర్బీఐ డిజిటల్‌ కరెన్సీని తీసుకొస్తుందన్న కథనాలు నిజమేనని(వచ్చే ఏడాది నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌ మొదలు).. ఇందుకోసం 1934 చట్టానికి సవరణలు (డిజిటల్‌ కరెన్సీని ఫిజికల్‌ నోట్లతో సమానంగా గుర్తించాలనే!) ప్రతిపాదన ఆర్బీఐ, కేంద్రం ముందు ఉంచిదనే సమాచారం అందుతోంది. ఈ లెక్కన ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది. 

ఇక 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్‌కాయిన్‌.. డిజిటల్‌ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్‌కాయిన్‌తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్‌ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది. నిర్మలా సీతారామన్‌ తాజా ప్రకటనతో బిట్‌కాయిన్‌ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది.

చదవండి: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్‌

మరిన్ని వార్తలు