Recession In India 2022: భారత్‌లో మాంద్యానికి ఆస్కారమే లేదు

21 Nov, 2022 05:51 IST|Sakshi

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌–చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ధీమా

న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌–చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో వృద్ధి రేటు 6–7 శాతం స్థాయిలో ఉంటుందని కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

అమెరికా, యూరప్, జపాన్‌తో పాటు చైనా తదితర దేశాల్లో ఏకకాలంలో మందగమనం కనిపిస్తోందని, దీనితో రాబోయే నెలల్లో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో కుమార్‌ చెప్పారు. మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు 6–7 శాతం స్థాయిలోనే ఉండవచ్చని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని, అలా కాకపోతే దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి రాగలదని కుమార్‌ చెప్పారు.    

ఎగుమతులపై దృష్టి పెట్టాలి..  
వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులను పెంచుకోవడానికి తగిన విధానాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కుమార్‌ చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి ఒకే ఎగుమతుల విధానం అమలుపర్చడం సరికాదన్నారు. సముద్ర తీరమే లేని పంజాబ్‌కు, శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యం చేస్తున్న తీర ప్రాంత రాష్ట్రం తమిళనాడుకు ఒకే తరహా ఎగుమతుల విధానాలు పని చేయవని కుమార్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు